సిటీ బ్యూరో/ ఎల్బీనగర్, మే 23 (నమస్తే తెలంగాణ): ఎల్బీ నగర్ నియోజకవర్గం వ్యాప్తంగా రెండు నెలలుగా తాగు నీటి సమస్య వెంటాడుతున్నా జలమండలి అధికారులు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఆరోపించారు. అధికారుల తీరుకు నిరసనగా ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయం వద్ద శనివారం ఆయన బీఆర్ఎస్ శ్రేణులు, నియోజకవర్గ ప్రజలతో కలిసి మెరుపు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ‘ నీటి చుక్క తమ ప్రాణాలకు రక్ష…. మిమ్మల్ని గెలిపించినందుకా మాకీ శిక్ష’, నీటి చుక్కల కోసం కన్నీరూ….. ఇదేనా మీ ప్రజా పాలన తీరు వంటి అనేక ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ఆందోళనలో పాల్గొన్నారు.
కార్యాలయం లోపలికి బాధితులు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున దూసుకెళ్లి ఆవరణలో కూర్చుని శాంతియుతంగా నిరసనకు దిగారు. ఖాళీ బిందెలు ప్రదర్శిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం, జలమండలి అధికారుల తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. మహిళలు, బీఆర్ఎస్ కార్యకర్తలు తాగునీటిని సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ప్రజలంతా తాగునీటి కోసం అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ర్టానికి రోజుకు 750 ఎంఎల్డీల నీటి అవసరం ఉన్నా కేవలం 550 ఎంఎల్‌డీలే సరఫరా చేస్తున్నారని ఆరోపించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నగర వ్యాప్తంగా రోజుకు 2 వేల ట్యాంకర్లే బుక్ చేసుకునేవారని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ ఏడాది రోజుకు 12 వేల ట్యాంకర్లు బుక్ అవుతున్నాయంటే నీటి సమస్య ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందన్నారు. కానీ పైపులైన్ ద్వారా మాత్రం నీటి సరఫరా పూర్తిస్థాయిలో జరగడంలేదని ఆరోపించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా మంనీటి సరఫరాపై అధికారులు చొరవ చూపాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గజ్జల మధుసూదన్‌రెడ్డి, బిచినేపల్లి వెంకటేశ్వర్రావు, అనంతుల రాజారెడ్డి, మాదవరం నర్సింహారావు, మాజీ కార్పొరేటర్లు కొప్పుల విఠల్‌రెడ్డి, జిట్టా రాజశేఖర్‌రెడ్డి, జిన్నారం విఠల్‌రెడ్డి, జీవీ సాగర్‌రెడ్డి, భవాని ప్రవీణ్‌కుమార్, సామ తిరుమల్‌రెడ్డి, రమావత్ పద్మా నాయక్, రమేష్ ముదిరాజ్, చెరుకు ప్రశాంత్ గౌడ్, డివిజన్ల అధ్యక్షులు కటికరెడ్డి అరవింద్‌రెడ్డి, లింగాల రాహుల్ గౌడ్, తోట మహేష్‌యాదవ్, జక్కల శ్రీశైలం యాదవ్, చెన్నగోని శ్రీధర్ గౌడ్, వరప్రసాద్‌రెడ్డి, రాజిరెడ్డి, సత్యం చారి, చింతల రవికుమార్, జక్కిడి రఘువీర్‌రెడ్డి, సొంటి చంద్రశేఖర్‌రెడ్డి, పొచంపల్లి రాజేందర్‌రెడ్డి, ఓరుగంటి వెంకటేష్, సుంకోజు కృష్ణమాచారి, శివప్రకాష్, గండి సన్నియాదవ్, మల్లెపాక యాదగిరి, దూసరి మధుగౌడ్, స్కైలాబ్, రంగేశ్వరి, శైలజ, విజయ గౌడ్, సింగిరెడ్డి మల్లీశ్వరి రెడ్డి, నాగలక్ష్మీ, రమాదేవి, శిల్పారెడ్డి, నరేష్, భాస్కర్ గంగపుత్ర తదితరులు పాల్గొన్నారు.
పోలీసుల అత్యుత్సాహం…
జలమండలి కార్యాలయం ఆవరణలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఆ ప్రాంత ప్రజలు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు వారిపై దురుసుగా ప్రవర్తించారు. అక్కడి నుంచి వెళ్లాలని హుకూం జారీ చేశారు.