మహేశ్వరం, డిసెంబర్ 27: విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం ఘట్టుపల్లి గ్రామం మండల పరిషత్ పాఠశాలను తనిఖీ చేశారు. అనంతరం బీటీ రోడ్డు పనులను పరిశీలించి, ఘట్టుపల్లి చెరువును సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో మన ఊరు-మనబడి కార్యక్రమం ద్వారా బడుల బాగు కోసం ఎంతో కృషి చేసినట్లు తెలిపారు.
నియోజకవర్గాన్ని విద్యానిలయంగా మార్చి ఎంతో మార్పు తీసుకురావడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ బడుల బలోపేతానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పేర్కొన్నారు. అనంతరం మన్సాన్పల్లి నుంచి ఘట్టుపల్లి వరకు నిర్మిస్తున్న రోడ్డును త్వరగా పూర్తి చేసినందుకు స్థానికులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలోని పట్టణ ప్రాంతాల్లో 11 గొలుసుకట్ట చెరువుల అభివృద్ధికి కృషి చేసి సత్ఫలితాలు సాధించినట్లు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చెరువుల సుందరీకణ పనులను చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు అనితా ప్రభాకర్‌రెడ్డి, థామస్‌రెడ్డి, ముక్కెర యాదయ్య, మెగావత్రాజునాయక్ నాయకులు జాన్‌రెడ్డి, వెంకటేశ్‌యాదవ్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.