Sabitha Indra Reddy | బడంగ్‌పేట, మే 1: తప్పుడు వాగ్ధానాలు చేసి.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, మంత్రులకు పాలన ఎలా చేయాలో తెలియదని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ‘మహిళలని చూడకుండా ఇష్టం వచ్చిన్నట్లు మాట్లాడితే ఖబర్దార్ రేవంత్‌రెడ్డి’.. అని హెచ్చరించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. పట్టించుకోని ముఖ్య మంత్రికి నోరు పారేసుకోవడం అలవాటైందన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పొలాల్లో తిరుగుతూ.. రైతుల కష్టాలు తెలుసుకుంటుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఐపీఎల్ మ్యాచ్‌లు చేస్తున్నారని విమర్శించారు.
ఆత్మహత్య చేసుకున్న రైతుల జాబితాను కేసీఆర్ ఇచ్చినా.. న్యాయం చేయలేదన్నారు. బుధవారం మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నందిహిల్స్‌లో మీర్‌పేట మహిళా విభాగం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు సునీతాబాల్ రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్నర్ సమావేశానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి గులాబీ పూలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానంటున్న రేవంత్ రెడ్డి సచివాలయంలో ఎందుకు కూర్చుంటున్నారో చెప్పాలన్నారు. రేవంత్‌రెడ్డి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.
బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్‌ను, ప్రజలను మోసం చేసిన చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్‌రెడ్డికి ఓట్ల ద్వారా ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు. తెలంగాణ రాష్ర్టానికి బీజేపీ ఏం చేసిందో చెప్పాలన్నారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు ఏ ఒక్కరోజు కూడా నియోజకవర్గంలో తిరగలేదన్నారు. మోదీని, రాముడిని చూసి ఓట్లు వేయమని అడుగుతున్నారని పేర్కొన్నారు.
అలాంటి వారికి ఓట్లు వేస్తే ప్రయోజనం లేదన్నారు. కేసీఆర్ బస్సు యాత్రకు తండోపతండాలుగా తరలివస్తున్న ప్రజలను చూస్తున్న కాంగ్రెస్, బీజేపీ నాయకులకు వణుకు పుడుతున్నదని చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి కేసీఆర్ పనిచేస్తారని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాటను మర్చిపోయి తప్పుడు ప్రచారం చేయడంలో ముందుంటారని విమర్శించారు. ఈ సమావేశంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కార్పొరేటర్లు సిద్దాల లావణ్య , అనిల్ కుమార్, భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.