బడంగ్‌పేట: సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్‌పేట పరిధిలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి సోమవారం ఆమె శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా దాటవేతధోరణి అవలంభిస్తున్నదన్నారు. ప్రజా పాలన దరఖాస్తులను మూలకు పడేసి.. మరోసారి రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవాలని చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, రేషన్ కార్డులు కోసం వేర్వేరుగా సర్వేలు చేయడం ఎందుకన్నారు. సర్వేల పేరుతో కాలయాపన చేయడానికి ప్రభుత్వం ఆడుతున్న నాటకమన్నారు. అర్హులందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్నిప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేశారని చెప్పారు. ప్రతి ఇంటికి మంచి నీళ్లు అందించేందుకు మిషన్ భగీరథ ద్వార రూ.370 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కమిషనర్ జ్ఞానేశ్వర్, కార్పొరేటర్లు భిక్షపతి చారి, అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.