బడంగ్‌పేట : దివ్యాంగులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం దివ్యాంగులకు ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి ట్రై సైకిల్స్‌ను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం దివ్యాంగుల అభివృద్ధికి కృషి చేసిందని చెప్పారు. పింఛన్లతో పాటు దివ్యాంగులకు కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసుకోవడానికి నిధులు కేటాయించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రభుత్వం పనిచేయాలన్నారు. అధికారంలోకి రాక ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీలిచ్చి అమలు చేయడం లేదని విమర్శించారు.
దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మీర్‌పేట అధ్యక్షుడు కామేశ్ రెడ్డి, తుక్కుగూడ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మయ్య, మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ, కార్పొరేటర్ భూపాల్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు దీప్లాల్ చౌహాన్, లలితాజగన్, నిర్మలారెడ్డి, అంజయ్య ఉన్నారు.