బడంగ్ పేట్,ఏప్రిల్ 21: వేసవిలో నీటి ఎద్దడి రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. మీర్పేట్ మున్సిపల్ అధికారులతో సోమవారం ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్నారు.
గుంతలమయంగా మారిన ప్రధాన, కాలనీల రోడ్లకు మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. మున్సిపాటిలీ పరిధిలోని మూడు చెరువుల చుట్టూ వీధిలైట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. చెరువుల్లో గుర్రపు డెక్క పేరుకుపోయిందని.. గత బీఆర్ఎస్ హయాంలో చెరువులలో గుర్రపు డెక్కను ఎప్పటికప్పుడు తొలగించేవారమని పేర్కొన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ చెరువుల పూడికతీతను పట్టించుకోకపోవడం వల్లనే అవి అధ్వానంగా తయారవుతున్నాయని సబితారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
చందన చెరువు వద్ద అవసరమైన చోట నూతన టాయిలెట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. బాలాపూర్ చౌరస్తా వద్ద ఉన్న లేబర్ అడ్డాను, స్ట్రీట్ వెండర్స్ షెడ్ వద్దకు తరలించాలని ఆదేశించారు. రైతు బజార్ పక్కన ఉన్న స్ట్రీట్ వెండర్ షెడ్ణు ఆక్షన్ ద్వారా లబ్ధిదారులకు కేటాయించాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించేవారిపై చర్యలు తప్పన్నారు. సమీక్ష సమావేశంలో కమిషనర్ జ్ఞానేశ్వర్, డీఈ వెంకన్న, ఏఈ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.