బడంగ్‌పేట, ఫిబ్రవరి 4: వివిధ రంగాలకు చెందిన వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితిలో లేదని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఆరోపించారు. మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాఘవేంద్రనగర్కాలనీలో ఏర్పాటు చేసిన నూతన కమ్యూనిటీ హాల్ భవనాన్ని మంగళవారం ఆమె ప్రారంభించి.. మాట్లాడారు. రాష్ట్రం అన్ని రంగాల్లో నష్టపోతున్నా.. ప్రభుత్వం కండ్లు తెరవకపోవడం బాధాకరమని ఆవేదన చెందారు. రాష్ట్రంలో రైతులు, బిల్డర్స్, ఆటో డ్రైవర్లు అనేక రంగాల వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. స్థానిక సంస్థలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని, సర్పంచులు, ఎంపీటీసీలు లేకపోవడంతో గ్రామాల్లో సమస్యలు జఠిలంగా మారాయన్నారు. కనీసం మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలైనా త్వరగా నిర్వహించాలన్నారు. పాలన వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా మారుతున్నదన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ జ్ఞానేశ్వర్, డీఈ వెంకన్న, మాజీ ప్రజా ప్రతినిధులు దుర్గ, లావణ్య, పద్మ, భూపాల్‌రెడ్డి, బీరప్ప బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అర్కల కామేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.