బడంగ్పేట్, నవంబర్ 26: మహేశ్వరం మండలంలోని అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ జెండాను ఎగురవేసే విధంగా బీఆర్ఎస్ నాయకులు సమష్టి విధానంతో పనిచేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మహేశ్వరంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సమావేశంలో సర్పంచుల ఎన్నికలపై చర్చించారు. గ్రామాల్లో గెలిచే వారికి అవకాశమివ్వాని, బీఆర్ఎస్ నేతలే చర్చించుకొని నిర్ణయం తీసుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీలో పోటీ లేకుండా చూసుకోవాలన్నారు.
గ్రూప్లు లేకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గతంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని ఓటర్లకు వివరించాలని, గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై ప్రజలకు వివరించాలన్నారు. తప్పుడు వాగ్దానాలు చేసి ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేసిన మోసాలను ఎండగట్టాలన్నారు. మహేశ్వరం మండలంలోని అన్ని గ్రామాల్లో సర్పంచులను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి బీఆర్ఎస్ నాయకుడు, కార్యకర్తపై ఉందన్నారు.
ఎన్నికలు పూర్తయేంత వరకు ప్రతి ఒక్కరూ కష్ట పడాలన్నారు. పదేళ్ల కాలంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రతి ఓటరకు వివరించాలన్నారు. అసమ్మతి లేకుండా ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచిగా పోటీ చేసే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కర్రొల చంద్రయ్య, అంబయ్య యాదవ్, చంద్రయ్య, నవీన్, అదిల్ అలీ, ప్రభాకర్, ఫరీద్, ఎంఏ షమీర్, సంజీవ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.