బడంగ్‌పేట, మే 16: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలలలో రైతులకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ నెరవేర్చకుండా రైతులను నిండా ముంచుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు గురువారం మహేశ్వరం మండల పరిధిలోని శ్రీశైలం హైవేపై రైతులకు ఇచ్చిన హమీ ప్రకారం అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి రైతులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై రైతులు శాపనార్ధాలు పెట్టారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముఖ్య మంత్రి తుక్కుగూడ మీటింగ్‌లో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల లిస్టు ఇస్తే 24 గంటలలో ప్రభుత్వం నుంచి సహకారం అందజేస్తామని అన్నారు. ముఖ్య మంత్రి హోదాలో ఉండి బోగస్ మాటలు చెబుతూ కాలయాపన చేస్తున్నారని ఆమె విమర్శించారు. ముఖ్యమంత్రి రైతుల పాలిటీ శాపంగా మారిండన్నారు. ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఏ ఒక్కటీ అమలు చేయలేని అసమర్ధ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అని ఆమె అన్నారు. రైతులకు రెండు లక్షలు రుణ మాఫీ చేస్తామని, ఇప్పటి వరకు ఎందుకు మాఫీ చేయడం లేదో సీఎం రైతులకు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
రెండు ఎకరాలు, మూడు ఎకరాల ఉన్న వారికి మాత్రమే రైతు బంధు వేస్తామని చెప్పడం, మిగతా వారికి ఇవ్వమనడం లాంటి మాటులు ఎందుకో..? ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు. పంటలు పండించిన రైతులు నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటుంటే సీఎం రాజకీయాలు చేయడం పట్ల ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏ వడ్లకైనా రూ.500లు బోనస్ ఇస్తామని ప్రకటించి, ఎందుకు అమలు చేయడం లేదన్నారు. రైతులు కల్లాలో వడ్లు పోసి కూసుంటే కనీసం పలకరించే వారు లేరన్నారు.
ప్రతి గింజకు బోనస్ ఇస్తామని ఊకదంపుడు ఉన్యాసాలు ఇస్తున్నారు.. తప్ప, అమలు చేయడం లేదన్నారు. రైతులను మోసం చేస్తే పుట్టగతులు ఉండవని ఆమె శాపనార్ధాలు పెట్టారు. కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులు నిరసన తెలుపుతున్నా పట్టించు కోవడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉలుకూ.. పలుకూ లేదన్నారు. వరంగల్‌లో రైతుల పంటలు ఎండి పోతున్నాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండే ఎండలో కట్టె పట్టుకొని రైతుల దగ్గరకు పోయి వారి కష్టాలు తెలుసుకుంటుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ చూసుకుంటూ ఎంజాయ్ చేశారని ఆమె ఎద్దేవా చేశారు.
దీని బట్టి రైతుల పట్ల ముఖ్యమంత్రికి ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వడం ఇవ్వకుండా దాట వేత ధోరణి అవలంభిస్తుందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మహేశ్వరం నియోజక వర్గం ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ, సొసైటి చైర్మన్ పాండు యాదవ్, చంద్రశేఖర్, బీఆర్ఎస్ నాయకులు అనుమగల్ల చంద్రయ్య, అర్కల కామేష్ రెడ్డి, నాగేష్, వర్కబోర్డు మాజీ చైర్మన్ శంశిద్ దీన్, దీప్లాల్ చౌహన్ అబ్జల్, సురేందర్ రెడ్డి, యాదగిరి గౌడ్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు.