మైలార్‌దేవ్‌పల్లి ,జూన్ 6: పారిశ్రామిక రంగంలో తెలంగాణ నంబర్‌వన్‌గా నిలిచిందని, యువతకు ఉద్యోగావకాశాలు పెరిగాయని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ కాటేదాన్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన పారిశ్రామిక ప్రగతి కార్యక్రమానికి ఆర్డీవో చంద్రకళతో కలిసి విచ్చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రంగారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే అత్యధిక పెట్టుబడులతో ఎంతో మందికి ఉపాధిగా మారిందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కాటేదాన్ పారిశ్రామిక వాడలో పవర్ హాలీడే అంటూ రెండు రోజులు కరెంటు సమస్య ఉండేదన్నారు. కరెంటు సమస్యలతో ప్రతి ఇంటిలో సామాన్యుల బాధలు ఎవరికి చెప్పలేని పరిస్థితి ఉందేదని అన్నారు. పరిశ్రమల్లో పని చేసే కార్మికులకు సరైనా పని లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్ ముందుగా కరెంటు, నీళ్ల పై దృష్టి పెట్టి 24 గంటల కరెంటు, కృష్ణా జలాలు ఇంటింటికీ అందిస్తూ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు. అభివృద్ధిని చూసి ఇతర రాష్ర్టాల పరిశ్రమలు మన రాష్ర్టానికి క్యూ కడుతున్నాయని అన్నారు. ఆర్డీవో చంద్రకళ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృషితో ఇతర రాష్ర్టాల నుంచి పరిశ్రమలు హైదరాబాద్ కు తరలి వచ్చేలా కృషి చేస్తున్నారని అన్నారు. పరిశ్రమలు రావడానికి ఇక్కడి శాంతి భద్రతలే కారణమని అన్నారు. కమిషనర్ అజీజా సుల్తానా మాట్లాడుతూ పరిశ్రామిక వాడ సుమారు 245 ఎకరాల్లో ఏర్పాటు చేశారని అందులో 600 పరిశ్రమలు ఏర్పాటుతో 5000 మంది కార్మికులకు ఉపాధి పొందుతున్నారన్నారు. ఆర్డీవో చంద్రశేఖర్ గౌడ్ ,తహసీల్దార్ చంద్రశేఖర్ గౌడ్ ,రాజేంద్రనగర్ డివిజన్ కార్పొరేటర్ అర్చన జయప్రకాశ్ ,ఎంపీపీ జయమ్మ శ్రీనివాస్ ,ఐపీవో శ్రీకాంత్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు ప్రేమ్ గౌడ్ ,రఘుయాదవ్, వెంకటేశ్ ,వర్క్ఇన్స్పెక్టర్ రాకేశ్ గౌడ్ పాల్గొన్నారు.