బండ్లగూడ, జూన్ 11 : బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేర్కొన్నారు. బుధవారం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏడు కోట్ల 30 లక్షలతో వివిధ ప్రాంతాలలో అభివృద్ధి పనులకు ఆయన స్థానికులతో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నామని, ప్రతి మున్సిపాలిటీ, డివిజన్ లో అవసరమైన అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నామన్నారు.
ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామిగా తీర్చిదిద్దుతానని అన్నారు.
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని తెలిపారు. సీసీ రోడ్లతో పాటు అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శరత్ చంద్ర, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ యాదయ్య, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాజ్ కుమార్, మాజీ మేయర్ మహేందర్ గౌడ్, మాజీ డిప్యూటీ మేయర్ రాజేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు పద్మావతి పాపయ్య యాదవ్, సంతోషి రాజిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.