Himayathsagar | సిటీబ్యూరో, జూలై 21 (నమస్తే తెలంగాణ )/ బండ్లగూడ/ మణికొండ : రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్‌లోని జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్సాగర్కి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో హిమాయత్‌సాగర్ రిజర్వాయర్ రెండు గేట్లను శుక్రవారం రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, జలమండలి అధికారులు ఎత్తారు. రిజర్వాయర్ రెండు గేట్లను ఒక ఫీటు మేర ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. హిమాయత్‌సాగర్‌కు 1200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. దిగువ మూసీలోకి 700 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కాగా మరో రిజర్వాయర్ ఉస్మాన్‌సాగర్‌లోకి 1000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. రిజర్వాయర్ మొత్తం సామర్థ్యం 3.9 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.902 టీఎంసీలుగా ఉంది. ఈ క్రమంలోనే ఎటువంటి ప్రాణనష్టం జరుగకుండా ముందు జాగ్రత్తగా మూసీ నది లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని ఎండీ దానకిశోర్ తెలిపారు. బోర్డు సిబ్బంది మూసీ నదికి ఇరువైపులా ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని, ప్రజలెవరూ అటువైపుగా వెళ్లొదని విజ్ఞప్తి చేశారు. రాబోయే మరో రెండు రోజుల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపిన సందర్భంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్లను అధికార యంత్రాంగంతో పాటు జీహెచ్ఎంసీ, పోలీస్ అధికారులను ఆదేశించారు.
నిండిన గండిపేట
1785.4 అడుగులకు చేరిన నీటి మట్టం.. ఎప్పుడైనా గేట్లు ఎత్తే అవకాశం..!ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉస్మాన్‌సాగర్ (గండిపేట) జలాశయంలో రోజురోజుకు నీటిమట్టం పెరుగుతున్నది. గండిపేట జలాశయం నీటి మట్టం 1790 అడుగులు కాగా ఇప్పటికే 1785.4 అడుగులకు నీరు వచ్చి చేరినట్లు జలమండలి డీజీఎం నరహరి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎగువ ప్రాంతాలైన వికారాబాద్, శంకర్పల్లి, బుల్కాపూర్, జన్వాడ ప్రాంతాల నుంచి వరదలు పోటెత్తడంతో ఎప్పుడైనా గేట్లు ఎత్తే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు.