సికింద్రాబాద్, ఏప్రిల్ 29 : ఓటరు జాబితా సవరణ కోసం నిర్వహించే ఇంటింటి సర్వే (ఎస్ఐఆర్) కార్యక్రమం పట్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సికింద్రాబాద్ శాశనసభ్యుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సమావేశం బుదవారం సీతాఫల్మండిలో జరిగింది. ఈ సందర్భంగా పద్మారావుగౌడ్ మాట్లాడుతూ మే 1వ తేదీ నుంచి ఎన్నికల సంఘం ఆధ్వర్యంలోని అధికారులు ఇంటింటికి వచ్చి కుటుంబ సభ్యుల వివరాలను ఓటరు జాబితాలో సరి చూసుకుంటారని తెలిపారు.
ఇంటింటి సర్వేకు వచ్చే అధికారులతో సమన్వయం చేసుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఏర్పాట్లు జరపాలని తెలిపారు. పార్టీ కార్యాక్రమాల్లో నేతలు చురుకగా పాల్గొనాలని పద్మారావుగౌడ్ సూచించారు. పార్టీకి కష్టపడి పనిచేసిన వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. కష్టపడి పనిచేసేన కార్యకర్తల వల్లే నేతలు రాణిస్తారని, తమ జీవిత కాలం పాటు గుర్తించుకుంటామని పద్మారావు గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తీగుల్ల రామేశ్వర్గౌడ్, మాజీ కార్పొరేటర్లు రాసూరి సునీత, లింగాని ప్రసన్న లక్ష్మీ, కంది శైలజ పాల్గొన్నారు.