కవాడిగూడ, మార్చి 31 : వేసవికాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. బండమైసమ్మ నగర్ బస్తీ కమిటీ ఆధ్వర్యంలో చౌరస్తాలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే ముఠాగోపాల్ ముఖ్య అతిథిగా హాజరై బీఆర్ఎస్ యువ నాయకుడు ముఠా జయసింహతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకోవాలన్నారు.
మండుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకుని స్వచ్చంద సంస్థలు, సేవా సంస్థలు చలివేంద్రాలను విరివిగా ఏర్పాటు చేసి బాటసారుల దాహార్తిని తీర్చాలని ఆయన సూచించారు. ప్రచండ భానుడి ప్రతాపాన్ని తట్టుకోవడానికి జాగ్రత్తలు పాటించాలని, మధ్యాహ్నం వేలల్లో బయటికి రాకుండా ఉదయం, సాయంత్రం సమయాల్లో పనులు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కవాడిగూడ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు వల్లాల శ్యామ్యాదవ్, నాయకులు కల్వగోపి, సాయికృష్ణ, సంతోష్, రమణ, అభి, మేకల శ్రీనివాస్‌యాదవ్, రాజేష్, శివ, మహేష్, సురేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.