సిటీబ్యూరో, జూలై 27 (నమస్తే తెలంగాణ) : అమ్మానాన్నల లక్ష్యం నెరవేర్చడం ఏ కొడుకుకైనా సంతోషాన్నిస్తుంది. అందులోనూ ఆ లక్ష్యం సామాజిక సేవే అయితే అది ప్రజలందరి సంబురంగా మారుతుంది. తల్లిదండ్రులకు గొప్ప సంతృప్తినిచ్చే విధంగా సేవలందిస్తున్న ఆ కుమారుడి పేరే మర్రి రాజశేఖర్ రెడ్డి. ఎంఎల్ఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫౌండర్ సెక్రటరీ. అమ్మ పేరు మీద ఆసుపత్రి పెట్టాలని మర్రి రాజశేఖర్ రెడ్డి భావించారు.
ఈ విషయాన్ని తన తల్లి అరుంధతికి చెప్పగా ఆమె చాలా సంతోషించింది. అయితే ఆమె తన కొడుకుతో ఇలా అంది ‘ఆసుపత్రి నిర్మించడం మంచి ఆలోచన.. అయితే అందులో అందించే ఏ సేవనైనా ఉచితంగా ఉంటేనే నా పేరు పెట్టు. అందరిలా ఆసుపత్రి ఏర్పాటు చేద్దామనుకుంటే మాత్రం నా పేరు పెట్టొద్దు.’ అని చెప్పింది. దీంతో రాజశేఖర్ రెడ్డి మరో మాట మాట్లాడకుండా ఉచితంగా సేవలందించేందుకే ఆసుపత్రి నిర్మిస్తానమ్మ అంటూ మాటిచ్చారు. అదే స్ఫూర్తితో 2019లో అరుంధతి ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకొచ్చారు. అరుంధతి పేరు చెప్పగానే అందరి నోళ్లల్లో నానేది ‘బిల్లు లేని ఆసుపత్రి’.
ఈ ఆసుపత్రిలో ప్రతి రోజూ 12 వందల మంది ఔట్ పేషెంట్లను పరీక్షిస్తున్నారు. అంతేకాక తండ్రి మర్రి లక్ష్మణ్ రెడ్డి 2007లో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను స్థాపించి.. ప్రతి ఏటా 35 మంది విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తున్నారు. సమాజంలో విద్య, వైద్యం అత్యంత ఖరీదుగా మారిన ఈ రోజుల్లో.. మేము ఉన్నామంటూ భరోసానిస్తున్న మర్రి కుటుంబ సభ్యుల సేవలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. నగర శివారులోని దుండిగల్‌లో ఉన్న మర్రి లక్ష్మణ్ రెడ్డి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్ దేశ వ్యాప్తంగా ఎందరి మనసుల్లోనే స్థానం దక్కించుకుంది. విద్య, వైద్యాన్ని వ్యాపారం కోణంలో చూసే ఈ రోజుల్లో.. నిరుపేదలకు అండగా నిలవాలనే లక్ష్యంతో సాగుతున్న మర్రి కుటుంబంపై నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం.