మల్కాజిగిరి, జూలై 18: ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ దానకిశోర్‌ను కలిసి ఎత్తు ప్రాంతాలైన దయానంద్‌నగర్, మల్లికార్జున్‌నగర్, గౌతంనగర్, హనుమాన్‌పేట్, ఏకలవ్యనగర్, అయ్యన్నగర్ ప్రాంతాల ప్రజలకు నీటి అవసరాల కోసం జీఎల్ఎస్ఆర్ రిజర్వాయర్‌ను నిర్మించాలని ఎమ్మెల్యే వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎత్తైన ప్రాంతాల్లో కాలనీల ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు రాకుండా గత ప్రభుత్వం రిజర్వాయర్‌ను మంజూరు చేసిందన్నారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న రిజర్వాయర్ నిర్మాణ పనులను ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జగదీశ్‌గౌడ్, అనిల్‌కిశోర్, రాము యాదవ్, ఉపేందర్‌రెడ్డి, అమీనుద్దిన్, లక్ష్మణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.