Arundathi Hospital | అమ్మానాన్నల లక్ష్యం నెరవేర్చడమనేది ఏ కొడుకుకైనా గొప్ప సంతోషాన్నిస్తుంది. అందులోనూ ఆ లక్ష్యం సామాజిక సేవే.. అయితే, అది జనమందరి సంబురంగా మారుతుంది. తల్లిదండ్రులకు గొప్ప సంతృప్తినిచ్చే విధంగా సేవలందిస్తున్న ఆ కొడుకు పేరు మర్రి రాజశేఖర్ రెడ్డి. ఎంఎల్ఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫౌండర్ సెక్రటరి. ఈ పేరు వినగానే అందరికి గుర్తొచ్చేది అరుంధతి ఆసుపత్రి. అరుంధతి పేరు చెప్పగానే అందరి నోళ్లల్లో నానేది ‘బిల్లు లేని ఆసుపత్రి’. ఇంతటితో ఆ సేవ ఆగలేదు. తండ్రి హృదయంలో ఉన్న క్రీడా స్థానాన్ని ఎరిగి ప్రతిష్టాత్మకమైన ఎంఎల్ఆర్ఐటీ కళాశాలలో ఖరీదైన చదువును ప్రతి ఏటా 35 సీట్లు ఉచితంగా విద్యార్థులకు కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నారు.
సమాజంలో విద్య, వైద్యం అత్యంత ఖరీదుగా మారిన ఈ రోజుల్లో సాధ్యమైనంత ఉచితంగా అందిస్తూ మేమున్నామంటూ భరోసానిస్తున్న ఆ మర్రి కుటుంబ సేవలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. నగర శివారులోని దుండిగల్‌లో ఉన్న మర్రి లక్ష్మణ్ రెడ్డి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్ దేశ వ్యాప్తంగా ఎందరి మనసుల్లోనే స్థానం దక్కించుకుంది. విద్య, వైద్యాన్ని వ్యాపారం కోణంలోనే చూసే ఈ రోజుల్లో నిరుపేదలకు అండగా నిలవాలనే లక్ష్యంతో సాగుతున్న ఆ మర్రి కుటుంబంపై నమస్తే తెలంగాణ ప్రత్యేక కథనం… – సిటీబ్యూరో, జూలై 27(నమస్తే తెలంగాణ):
గుండె సంబంధిత వ్యాధులకు క్యాత్‌ల్యాబ్, అంజియో, ఏకో, ట్రెడ్ మిల్, బైపాస్ సర్జరీ ద్వారా అధునాతన చికిత్సలు అందిస్తున్నారు. యూరాలజీ, నెఫ్రాలజీ విభాగంలో కిడ్నీ సంబంధించిన వ్యాధులకు డయాలసిస్ లేజర్, ల్యాప్రోస్కోపిక్ ద్వారా సేవలందిస్తున్నారు. న్యూరాలజీ, న్యూరో సర్జరీ విభాగాల్లో మెదడు, వెన్నుపూస వ్యాధులకు ఎంఆర్ఐ, సీటీ, ఈఈజీ, ఈఎంజీ, ఆధునాతన మైక్రోస్కోప్ ద్వారా వైద్య సేవలందిస్తున్నారు. అదే విధంగా గ్యాస్ట్రో, లివర్‌కు సంబంధించిన వ్యాధులకు ఎండోస్కోపీ, శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. అలాగే, స్పెషాలిటీ విభాగాలలో జనరల్ సర్జరీలో ల్యాప్రోస్కోపిక్, ప్లాస్టిక్, కాస్మెటిక్ సర్జరీ, మాతా శిశువు సేవలలో భాగంగా నార్మల్, సిజేరియన్ డెలివరీలు, ఇన్ఫెర్టిలిటీ, క్యాన్సర్ స్క్రీనింగ్, ఫ్యామిలీ ఫ్లానింగ్ సేవలు అందించబడుతున్నాయి. అంతే కాకుండా కళ్లు, ముక్కు, చెవి, గొంతు, ఊపిరితిత్తుల సమస్యలకు చికిత్స అందిస్తున్నారు. 24 గంటలు ఉచితంగా వైద్య సేవలందిస్తున్నారు.
మా ఇనిస్టిట్యూట్‌లో విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యతనిస్తాం. క్రీడాకారులను ప్రోత్సహిస్తాం. స్టేట్, నేషనల్ స్థాయిలో ఏదైనా క్రీడలో ప్రావీణ్యం ఉన్న విద్యార్థులు మా కళాశాలలో ఉచితంగా చదువుకోవచ్చు. ఇక్కడ వారికి నిపుణులైన కోచ్‌లు సైతం అందుబాటులో ఉంటారు. వారికి అన్ని రకాలుగా అండగా నిలుస్తాం. అవసరమైతే వారి ప్రతిభకు తగ్గట్టు క్రీడల్లో రాణించేందుకు సహకారం కూడా అందిస్తాం. క్రీడలకు ప్రాధాన్యతనివ్వాలనే లక్ష్యంతోనే మా క్యాంపస్‌లో అత్యాధునిక హంగులతో క్రికెట్, ఫుట్‌బాల్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్ స్టేడియంలు ఏర్పాటు చేశాం.
– మర్రి లక్ష్మణ్ రెడ్డి, చైర్మన్, ఎంఎల్ఆర్ఐటీ.
అమ్మకు ఇచ్చిన మాట కోసం అత్యాధునిక ఆసుపత్రిని ఏర్పాటు చేశాం. 24 గంటలు పూర్తిగా ఉచితంగా సేవలందిస్తున్నాం. ఇక్కడ చికిత్స తీసుకుని ఆరోగ్యంగా ఇంటికెళ్లే వాళ్ల కండ్లలో ఆనందం చూసినప్పుడు అది మాకెంతో సంతృప్తినిస్తుంది. లక్షల రూపాయల విలువజేసే అనేక శస్త్ర చికిత్సలు అన్నీ పూర్తిగా, ఉచితంగా అందిస్తున్నాం. నాన్నకు ప్రేమతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి క్రీడాకారులకు అండగా నిలుస్తున్నాం. క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తూ అత్యాధునిక క్రీడా ప్రాంగణాలను తీర్చిదిద్దాం.
– మర్రి రాజశేఖర్ రెడ్డి, సెక్రటరి ఫౌండర్, ఎంఎల్ఆర్ఐటీ, అరుంధతి ఆసుపత్రి.