నేరేడ్మెట్, జూన్ 24: ప్రజా సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం గౌతంనగర్ డివిజన్ రాజశ్రీనివాస్ నగర్ కాలనీ, వెంకటాద్రినగర్‌లో ఏడాదైనా పూర్తిగాని బాక్స్డ్రైనేజీ పనులను స్థానిక కార్పొరేటర్ మేకల సునీతా రాముయాదవ్‌తో కలిసి పరిశీలించారు. ముంపు నుంచి ప్రజలను రక్షించాలని డిమాండ్ చేస్తూ పూర్తికాని బాక్స్ డ్రైనేజీ పై బైఠాయించి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, కార్పొరేటర్ మేకల సునీతారాముయాదవ్ స్థానికులతో కలిసి ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మిర్జాలగూడ, వెంకటాద్రినగర్, రాజానగర్, రాజా శ్రీనివాస్‌నగర్, పవన్ మోటర్ ప్రాంతాలు వర్షం కురిసిన ప్రతిసారి ముంపునకు గురవుతున్నాయని తెలిపారు. సంవత్సరం క్రితం పనులు ప్రారంభించినా నత్తను తలపించేలా సాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన విషయాన్ని తెలుసుకున్న మున్సిపల్ అధికారులు డీఈ లౌక్య ఎమ్మెల్యేతో మాట్లాడి విద్యుత్ స్తంభాలు బాక్స్డ్రైనేజీ పనులకు అడ్డుగా ఉన్నాయని వాటిని తొలగించగానే రెండు, మూడు రోజుల్లో పనులు చేపడుతామని హామీ ఇవ్వగా… వారు ఆందోళన విరమించారు.