జూబ్లీహిల్స్/బంజారాహిల్స్, నవంబర్ 3: నగర అభివృద్ధికి నాడు పీజేఆర్ చేసిన సేవలకు దీటుగా నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాంగటి గోపీనాథ్ పేర్కొన్నారు. యూసుఫ్‌గూడ మహమూద్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులతో, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాంగటి గోపీనాథ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఐదు దశాబ్దాలు సేవ చేసిన కుటుంబానికి టికెట్ ఇచ్చేందుకు డబ్బులు డిమాండ్ చేశారంటే, ఆ పార్టీ ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమైనా.. తన తండ్రి పీజేఆర్ ఆశయ సాధనైనా ఒక్కటే.. కాబట్టి నేడు పీవీఆర్ బీఆర్ఎస్ పార్టీలోకి అడుగు పెట్టారన్నారు.
తన తండ్రి కోరుకున్న విధంగా పేదలను, అన్ని వర్గాల ప్రజలను ఆదరిస్తున్న సీఎం కేసీఆర్‌తోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని పీవీఆర్ గుర్తించబట్టే నేడు బీఆర్ఎస్ పార్టీతో మమేకమయ్యేందుకు సిద్ధమయ్యాడని అన్నారు. తనకంటే వయసులో చిన్నవాడైనా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా తన కంటే సీనియర్ అని, విష్ణు తన సోదర సమానుడని అన్నారు. అనంతరం, విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి 52 ఏండ్లు సేవ చేసిన పీజేఆర్ కుటుంబానికి టికెట్ ఇచ్చేందుకు రూ.5 కోట్లు డిమాండ్ చేశారంటే అంతకన్నా అవమానం మరొకటి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే నేడు రాష్ర్టాన్ని అమ్ముకునే దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నారని అన్నారు.
హైదరాబాద్ నగరానికి పీజేఆర్ చేసిన సేవలను గుర్తించి కొడిగట్టిన దీపం లాంటి నా రాజకీయ జీవితాన్ని సీఎం కేసీఆర్ తిరిగి నిలబెట్టారని అన్నారు. పీజేఆర్ కుటుంబానికి అవమానం చేసిన కాంగ్రెస్‌కు పీజేఆర్ అభిమానులు, ఆత్మీయులు బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ ఎన్నికలలో మాగంటి గోపీనాథ్‌ది కాదని, గతంలో నాకు వచ్చిన 56 వేల పీజేఆర్ అభిమానుల ఓట్లతో పాటు బీఆర్ఎస్ అభ్యర్థిని బంపర్ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పేదల కోసం కష్టపడి పనిచేయడం తన తండ్రి నుంచి అలవడిందని.. ఇకపై బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో పీజేఆర్ ఆశయ సాధనకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎన్నికల ఇన్ఛార్జ్ కట్టెల శ్రీనివాస్ యాదవ్, మైనార్టీ రాష్ట్ర నేత సొహైల్, కార్పొరేటర్లు రాజ్ కుమార్ పటేల్, దేదీప్య రావు, సీఎన్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.