MLA Mainampally Rohit | సిటీబ్యూరో: మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ వ్యవహార తీరు చర్చనీయాంశంగా మారుతున్నది. అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ.. అంతకు మించిన దురుసు ప్రవర్తనతో తరచూ వార్తలో నిలుస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన రాహుల్ గాంధీ పర్యటనలోనూ ఆయన తీరుపై సర్వత్రా విమర్శలొచ్చాయి. భద్రతా నిబంధనలను ఉల్లంఘించి.. ఏకంగా రాహుల్ గాంధీ కాన్వాయ్‌లోకి చొచ్చుకుపోయారు. వెంటనే తేరుకున్న భద్రత సిబ్బంది.. ఆయన కారును అడ్డుకున్నారు.
ఈ వ్యవహారం సోషల్ మీడియాలో విస్తృతమైన చర్చకు దారితీసింది. తాజాగా అదే దుందుడుకు స్వభావంతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు కారణమయ్యారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనూ ఇదే తీరుగా వార్తల్లో నిలిచారు. లోడింగ్ వెహికిల్ సాయంతో నేరుగా ఎయిర్‌పోర్టులోకి చొచ్చుకొని పోయే ప్రయత్నం చేయగా.. అడ్డుకున్న టోల్ సిబ్బందిపై విరుచుకుపడినట్లు ఓ వీడియో ఎక్స్‌లో హల్చల్ చేస్తున్నది. ఈ వీడియోను వాహనదారులు ఎక్స్‌లో పోస్టు చేయగా, ఆయన దురుసు ప్రవర్తన మరోసారి చర్చకు కారణమైంది. అతి చిన్న వయస్సులో పదవీ భాగ్యం దక్కినా… దాన్ని నిలుపుకోలేకపోతున్నారంటూ.. నెటిజన్లు మండిపడుతున్నారు. ఆయన వ్యవహార తీరు ఎప్పుడూ వివాదాలకు దారి తీస్తున్నదని అభిప్రాయపడుతున్నారు.