వెంగళరావునగర్, జూన్ 8:కార్యకర్తలంటే ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు పంచ ప్రాణాలు. ఏ కష్టమొచ్చినా కార్యకర్తలకు తోడుండి అండగా నిలబడి.. అసలైన ప్రజా నాయకుడిగా ఎమ్మెల్యే మాగంటి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. పార్టీ కార్యక్రమాలు, ప్రజా సేవలో చురుగ్గా ఉండే బోరబండ బీఆర్ఎస్ మైనార్టీ డివిజన్ నాయకుడు సర్దార్ అంటే మాగంటికి ప్రత్యేక అభిమానం. సర్దార్ చేసే ప్రజాహిత కార్యక్రమాలకు మాగంటి వెన్నంటి ఉండి ప్రోత్సహించారు.
200 మంది కార్యకర్తలకు స్కూటీలిచ్చి..
పార్టీ కార్యక్రమాలు, సమావేశాలు, ప్రజా సమస్యలపై పోరాటం చేసినప్పుడు కార్యకర్తలు కొందరు నడుచుకుంటూ రావడం, మరికొందరు ఆటోలకు చార్జీలు పెట్టుకుని రావడాన్ని మాగంటి గమనించారు. పార్టీలో కష్టపడి పనిచేసే పేద, మధ్య తరగతికి చెందిన కార్యకర్తల కోసం తన సొంత డబ్బును వెచ్చించి 200 ఎలక్ట్రిక్ స్కూటీలను కొని ఇచ్చారు. ఇలా ఒక్కటేమిటి మహిళలకు చీరలు, మిక్సిలు పంచిపెట్టారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో ప్రభుత్వం నుంచి రూ.లక్షలు అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎందరికో అపన్నులకు సాయం అందేలా కృషి చేశారాయన.
సర్దార్ మృతితో కుంగిపోయి..
బోరబండ ప్రజలకు తలలో నాలుకలా మెలిగే సర్దార్ బీఆర్ఎస్ లో సమర్థుడైన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ కాంగ్రెస్‌లోకి ఫిరాయించాక..తనతో పాటు కాంగ్రెస్‌లోకి రావాలని సర్దార్‌పై బాబా ఒత్తిడి తెచ్చినా..నమ్ముకున్న బీఆర్ఎస్ లోనే సర్దార్ కొనసాగారు. ఈ నేపథ్యంలో బోరబండలో సర్దార్ ఇల్లు పునర్నిర్మించుకుంటుండగా..రూ.5 లక్షలు లంచం ఇవ్వాలని..లేకుంటే ఇల్లు కూల్చివేయిస్తామని బాబా పీఏ సప్తగిరి బెదిరింపులకు గురి చేశాడు.
సర్దార్ ఇంటికి బాబాతో పాటు..అతని భార్య హాబీబా సుల్తానా, పీఏ సప్తగిరి అనేకసార్లు వచ్చి బెదిరింపులకు గురిచేశారని సర్దార్ కుటుంబ సభ్యులు వాపోతున్నారు. లంచం ఇవ్వకపోవడంతో సర్దార్ ఇంటిని బల్దియా అధికారులతో బాబా కూల్చివేయించడంతో సర్దార్ కుంగిపోయి తన ఇంటి మూడో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ ఉదంతంతో బాబా దౌర్జన్యాలపై ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అలుపెరుగని పోరాటం చేశారు. పార్టీలకు అతీతంగా అందర్నీ ఏకతాటిపైకి తెచ్చి ఉద్యమమే నడిపారు మాగంటి. ప్రధాన అనుచరుడు సర్దార్ ఆత్మహత్య మాగంటిని కలిచివేసింది. సమయానికి భోజనం తినకపోవడం, ఆరోగ్యంపై దృష్టి పెట్టకపోవడంతో మాగంటి నీరసించిపోయారు. గుండెపోటుకు గురయ్యారు. చికిత్స పొందుతూ.. ఆదివారం ఉదయం 5.45కు తుదిశ్వాస విడిచారు.
మాగంటి పార్ధీవదేహం వద్ద బాబా డౌన్ డౌన్ అంటూ నినాదాలు
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ పార్థ్ధీవ దేహానికి నివాళులర్పించి.. వెళ్లేటప్పుడు అక్కడున్న మహిళా కార్యకర్తలు బాబా డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. బాబా అరాచకాలతో బలైన సర్దార్ ఆత్మహత్య మాగంటిని నిద్రాహారాలు లేకుండా కుంగేలా చేసిందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు.