కేపీహెచ్‌బీ కాలనీ, ఆగస్టు 26 : దేశంలోని మైనార్టీల మసీదులు, దర్గాలు, స్మశానవాటికలు తదితర ఉమ్మడి ఆస్తుల పరిరక్షణ కోసం ఏర్పడిన వక్ఫ్ బోర్డును(Waqf Board) కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ పేరుతో నిర్వీర్యం చేయొద్దని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram) కోరారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ…కేంద్ర ప్రభుత్వం వక్ఫ్‌బోర్డు నిర్వీర్యం చేసే దిశగా చేస్తున్న యత్నాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. చట్ట సవరణ పేరుతో వక్ఫ్ బోర్డు ఆస్తుల నిర్ణయాధికారాన్ని జిల్లా కలెక్టర్లకు కట్టబెట్టడం సరికాదని, మతపరమైన ఆస్తుల పరిరక్షణలో రాజకీయాలకు చోటు కల్పించే దిశగా చర్యలు తీసుకోవడం అవివేక పూరిత చర్య మాత్రమేనన్నారు.
వక్ఫ్ బోర్టులలో ముస్లియేతరులకు స్థానం కల్పించడం, వందల సంవత్సరాల నాటి నుంచి ముస్లిం మతపెద్దలు, మసీదులు, దర్గాల పరిధిలోని ఆస్తులపై నిర్ణాయాధికారాన్ని కలెక్టర్లకు అప్పగించడం వంటి వివాదాస్పద సవరణలను వక్ఫ్ బోర్డు చట్టంలో తీసుకరావాలనుకుంటుందని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముస్లిం, మైనార్టీలకు తీవ్ర అన్యాయం చేసేందుకు పార్లమెంట్ సాక్షిగా చర్యలకు పూనుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. బ్రిటీష్ కాలంనుంచి అమలులో ఉన్న వక్ఫ్‌బోర్డు చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లా మైనార్టీటి అధ్యక్షుడు ఎండీ.గౌసుద్ధీన్ ఉన్నారు.