కేపీహెచ్‌బీ కాలనీ , నవంబర్ 3 : పెద్దోళ్ల భవంతులను వదిలేసి పేదలపై హైడ్రా తన ప్రతాపం చూపుతున్నదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మండిపడ్డారు. హైడ్రా పేరుతో అధికార పార్టీ నేతలు బెదిరింపులకు పాల్పడుతూ వసూళ్లకు తెగబడుతున్నారన్నారు. మూసాపేట డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివారం మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్‌కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నివాసంలో జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ తన అండ ఉంటుందని, ఎటువంటి కష్టం వచ్చినా తీర్చేందుకు ముందు వరుసలో ఉంటానన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వందల కోట్ల నిధులను వెచ్చించి అనేక అభివృద్ధి పనులను చేపట్టగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి సున్నా అని విమర్శించారు. కాంగ్రెస్ , బీజేపీలను గెలిపిస్తే తెలంగాణ ప్రజలకు ఏం న్యాయం చేశారని కృష్ణారావు ప్రశ్నించారు. ఆ రెండు పార్టీలు కుమ్మక్కై బీఆర్ఎస్ తిట్టడం తప్ప ప్రజలకు ఏమాత్రం మంచి చేయడం లేదన్నారు. పేద ప్రజలకు తాను అండగా ఉంటానని, ఎవరూ ఆందోళన చెందాల్సి అవసరం లేదని ఎమ్మెల్యే కృష్ణారావు భరోసా ఇచ్చారు.