బతుకమ్మ పేరుతో కోట్లాది రూపాయలు దండుకుని, లిక్కర్ స్కామ్ ఆరోపణలతో తండ్రి కేసీఆర్, బీఆర్ఎస్ పేరును చెడగొట్టిన నువ్వా హైదరాబాద్ ఎమ్మెల్యేలను విమర్శించేదని ఎమ్మెల్సీ కవితపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఇటీవల కూకట్పల్లి పర్యటనలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే కృష్ణారావు ఘటుగా స్పందించారు. మంగళవారం క్యాంప్ ఆఫీస్‌లో ఎమ్మెల్యే కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ.. నగరంలోని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల గురించి మాట్లాడే కనీస అర్హత కవితకు లేదని అన్నారు. కూకట్‌పల్లిలో కౌన్సిలర్‌గా, వైస్ చైర్మన్‌గా, మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని.. ముప్ఫై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ప్రశంసలు, విమర్శలు ఎదుర్కొన్నానని.. కానీ మీలాంటి చౌకబారు విమర్శలు ఎవ్వరూ చేయలేదని..కేసీఆర్‌పై అభిమానంతో వదిలిపెడుతున్నానని మరోసారి విమర్శిస్తే నీ బండారం బయటపెడతానని మాధవరం స్పష్టం చేశారు. టీడీపీలో ఎమ్మెల్యేగా గెలిచి, కేసీఆర్ పిలుపుతో బీఆర్ఎస్లో చేరామన్నారు. ఎక్కడ ఉన్నా క్రమశిక్షణతో పనిచేస్తానని, మీలాగ స్వార్థపరులం కాదన్నారు.
-కేపీహెచ్‌బీ కాలనీ, డిసెంబర్ 9
బతుకమ్మ పేరుతో కోట్లాది రూపాయలు దోచుకున్న నీకు.. తెలంగాణ రాకముందు ఎన్ని ఆస్తులు ఉండేవి… ఇప్పడు నీకు, నీ భర్తకు ఉన్న ఆస్తులు ఎన్ని అని కవితను మాధవరం ప్రశ్నించారు. తెలంగాణ ఆడబిడ్డల గౌరవాన్ని నాశనం చేయడంతో పాటు తెలంగాణ రాష్ర్టానికి గాంధీలాంటి వ్యక్తి కేసీఆర్ పరువు తీస్తున్నావన్నారు. వస్త్ర దుకాణాలు, బంగారం షాపులను కూడా వదలలేదన్నారు. గాజులరామరాంలో లొల్లిచేసి.. ఇప్పుడు ఎందుకు సప్పుడు చేయడం లేదో చెప్పాలన్నారు. రేవంత్‌రెడ్డితో కలిసి 18 ఎకరాల ప్రభుత్వ భూమిని దక్కించుకున్నట్లు మాధవరం ఆరోపించారు. లిక్కర్ స్కామ్ ఆరోపణతో తెలంగాణ పరువు తీసిన నీకు ఇక్కడ తిరిగే అర్హత లేదన్నారు.
నీ వైఖరి కారణంగానే నిన్ను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీశ్‌రావును వెళ్లగొట్టి.. కేటీఆర్‌ను అరెస్ట్ చేయించాలని కవిత డ్రామాలాడుతున్నారని మాధవరం ఆరోపించారు. పదేండ్ల పాటు పదవులు అనుభవించి..పార్టీ కష్టకాలంలో ఉంటే లేనిపోని ఆరోపణలు చేసి పార్టీ నుంచి బయటకు పంపించేలా డ్రామాలాడింది నువ్వుకాదా అని మాధవరం ప్రశ్నించారు. తెలంగాణలో బీసీ లీడర్లు లేనట్లు నీవు బీసీల గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. మరోసారి తనపై కానీ, హైదరాబాద్ ఎమ్మెల్యేలపై గానీ విమర్శలు చేస్తే కవిత బండారాన్ని బయటపెడతానని మాధవరం తీవ్రంగా హెచ్చరించారు.
కవిత.. చెల్లని రూపాయి..
కుత్బుల్లాపూర్, డిసెంబర్9: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చెల్లని రూపాయి అని..రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌పై అవగాహన లేకుండా చేసిన విమర్శలపై కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఖండించారు. మంగళవారం చింతల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో పార్టీ నియోజకవర్గ నాయకులు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీకి కవిత శనిలా దాపురించారన్నారు. అయినా తాము తెలంగాణ జాతిపితైన కేసీఆర్ బిడ్డగా గౌరవించామన్నారు. పెరిక చెరువుపై కవిత చేసిన వాఖ్యలు పూర్తిగా అవాస్తవమన్నారు. గతంలో కుత్బుల్లాపూర్ పర్యటనకు వచ్చిన నీవు కేంద్రంతో కొట్టాడైనా జగద్గిరిగుట్టలో బస్సుడిపో కట్టిస్తా అన్నావని.. ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. అడికోర్ పెట్టుబడులపై రేవంత్‌రెడ్డి, మీరు డైరెక్టర్లుగా ఉన్న విషయంపై మాట్లాడాలన్నారు.
రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 300 డివిజన్లలో పోటీచేసి 200కు పైగా కార్పొరేటర్ సీట్లు కైవసం చేసుకుంటామన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ అధికారంలోకి వస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు దూదిమెట్ల సోమేశ్యాదవ్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, పోలే శ్రీకాంత్, పుప్పాల భాస్కర్, నాయకులు కస్తూరి బాల్‌రాజు, తెలంగాణ సాయి, ఇస్మాయిల్, శివనాయక్, మహిళా నాయకురాలు అర్పితాప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.