కేపీహెచ్బీ కాలనీ, ఫిబ్రవరి 28 : జీహెచ్ఎంసీ అభివృద్ధి చేసిన పార్కులలో ప్రజలు వాకింగ్ చేయడానికి డబ్బులు వసూలు చేయడం బాధాకరమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం కేపీహెచ్బీ కాలనీ డివిజన్ లోని పార్కులను ఎమ్మెల్యే కృష్ణారావు కార్పొరేటర్ శ్రీనివాసరావు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…కేపీహెచ్బీ కాలనీలోని మలేషియన్ టౌన్ షిప్ పక్కన 5 ఎకరాల ఖాళీ స్థలాన్ని పార్కుగా, క్రీడా ప్రాంగణంగా అభివృద్ధి చేసినట్లు చెప్పారు.
ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేసిన పార్కులో ప్రజలు వాకింగ్ చేయడానికి బల్దియా అధికారులు డబ్బులు వసూలు చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా పార్కుల అభివృద్ధి కోసం ఒక రూపాయి కూడా కేటాయించలేదని విమర్శించారు. పార్కులను అభివృద్ధి చేయకపోగా.. గతంలో అభివృద్ధి చేసిన పార్కులలో ఫీజులు పెట్టి ప్రజల వద్ద డబ్బులు వసూలు చేయడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో ఈఈ శ్రీనివాస్, డీఈ శంకర్, జలమండలి మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, ఉద్యానవన విభాగ డిప్యూటీ డైరెక్టర్ పద్మనాభం తదితరులు పాల్గొన్నారు.