బాలానగర్, అక్టోబర్ 1 : హైడ్రా( Hydraa) ఓ ప్రైవేటు కంపనీ. ప్రజలు బయపడి ఆత్మహత్యలకు పాల్పడవద్దు అని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram) భరోసా కల్పించారు. మంగళవారం ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్ హస్మత్‌పేట బోయిన్‌చెరువును స్థానిక కార్పొరేటర్ ముద్దం నర్సింహయాదవ్, జీహెచ్ఎంసీ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో కలిసి అక్కడ జరుగుతున్న రిటైనింగ్‌వాల్ నిర్మాణం, వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బోయిన్ చెరువు సుందరీకరణ కోసం కోట్లాది నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. బోయిన్‌చెరువు సమీపంలోని హరిజనబస్తీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఏర్పడిందని స్పష్టం చేశారు.
50 సంవత్సరల క్రితం ఏర్పడిన హరిజనబస్తీ మాత్రమే అక్రమణ జరిగిందని ఇరిగేషన్ అధికారులు ప్రకటించడం జయలక్ష్మి గార్డెన్ పేరు ఎత్తకపోవడం పట్ల అధికారుల తీరుపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. జయలక్ష్మి గార్డెన్ 8 ఎకరాలు ఆక్రమణకు గురికాగా అధికారులు కేవలం మూడు ఎకరాలని బుకాయించడం సరికాదన్నారు. జయలక్ష్మి గార్డెన్ ఓ కాంగ్రెస్ నేతకు చెందినది అందుకే ఇరిగేషన్ అధికారులు దాటవేసే ప్రయత్నాలు చేయడం బాధాకరమన్నారు. చెరువు స్థలంలో ఇండ్లు కట్టుకున్న వారెవరూ భయపడొద్దని భరోసా కల్పించారు.