కుత్బుల్లాపూర్,అక్టోబర్6 : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫోర్త్ సిటీ పేరుతో ప్రజల్లో ఊహగానాలు లేపి చివరకు సీఎం రేవంత్‌రెడ్డి తన స్వలాభం కోసం ఇన్సైడ్ ట్రేడింగ్‌కు పాల్పడుతున్నాడని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్(MLA KP Vivekanand) అన్నారు. ఆదివారం జీడిమెట్ల విలేజ్ గాంధీవిగ్రహం వద్ద మెట్రో సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తన సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ నగరానికి నలుదిక్కులా మెట్రో(Metro train) విస్తరణ, ఫ్లై ఓవర్లు అండర్ పాసుల నిర్మాణం వంటి అనేక అభివృద్ధి పనులతో కేసీఆర్ సారధ్యంలో ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు.
నగరానికి ఉత్తరం వైపునా కొంపల్లి, మేడ్చల్, తూముకుంట, శామీర్‌పేట్ ప్రాంతాలకు మెట్రో విస్తరణపై సర్వే సంస్థలను ఎంపిక చేసి పనులను అప్పగిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కొద్దిరోజులకే పక్కన పెట్టి ఫోర్త్‌సిటీ పేరుతో రూ.8 వేల కోట్లను ప్రతిపాదించి సీఎం రేవంత్‌రెడ్డి ఇన్సైడ్ ట్రేడింగ్‌కు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇక్కడి ప్రాంతానికి న్యాయబద్దంగా రావాల్సిన మెట్రోను సాధించేంత వరకు ఉద్యమాలు ఆపేదిలేదని హెచ్చరించారు. ఈ ధర్నాకు మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ తన సంపూర్ణ మద్దతు తెలిపారు.