కుత్బుల్లాపూర్, అక్టోబర్ 23: దుండిగల్ పీఎస్ పరిధిలోని భౌరంపేటలో బాలికపై జరిగిన అఘాయిత్యంపై పోక్సో చట్టం అమలు చేసి, నిందితుడిని రిమాండ్‌కు తరలించామని మేడ్చల్ జోన్ డీసీపీ ఎన్.కోటిరెడ్డి తెలిపారు. ఈ కేసును పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారని, నిందితుడిని ఉరితీయాలని, న్యాయం జరిగే వరకు ఆందోళనలు చేపట్టాలని పలు సంఘాలు, వ్యక్తులు పెట్టిన పోస్టులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
ఈ క్రమంలోనే బుధవారం భౌరంపేట ప్రాంతానికి చెందిన యువకులు పెద్ద ఎత్తున పేట్ బషీరాబాద్‌లోని డీసీపీ కార్యాలయానికి తరలివచ్చారు. ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకున్నారు.. అని అడిగారు. దీనిపై స్పందించిన డీసీపీ కోటిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని ప్రచారాలు మా దృష్టికి వచ్చాయన్నారు. బాలికపై జరిగిన అఘాయిత్యంపై ఇప్పటికే నిందితుడిని జైలుకు పంపినట్టు తెలిపారు. దీనిపై ఎలాంటి అపోహలు అవసరం లేదన్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని, ఇతర ఆధారాలను కూడా సేకరిస్తున్నామన్నారు.
భౌరంపేటలో బాలికపై జరిగిన అఘాయిత్యంపై పోలీసులు సత్వర చర్యలు తీసుకోవాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు బుధవారం డీసీపీ కోటిరెడ్డిని కోరారు. భౌరంపేటకు చెందిన యువకులు పెద్ద ఎత్తున పోలీస్‌స్టేషన్‌కు తరలివచ్చారు. ఈ విషయం తెలుసుకున్న వారు డీసీపీ కార్యాలయానికి వచ్చి యువకులతో చర్చించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తెస్తామంటూ స్థానిక యువకులకు హామీ ఇచ్చారు.