గోల్నాక, జనవరి 6: అంబర్పేట నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న కిడ్నీ రోగులకు భారీ ఉపశమనం కలిగించామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఎట్టకేలకు అంబర్పేటలో డయాలసిస్ సెంటర్ అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ మేరకు సోమవారం అంబర్ పేట మున్సిపల్ కాలనీ మున్సిపల్ దవాఖానలో రూ.1 కోటి వ్యయంలో అథ్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ప్రభుత్వ డయాలసిస్ సెంటర్ను స్థానిక కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ తో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు మాట్లాడుతూ..కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ప్రతి నెలా వారానికి రెండు సార్లు అంటే నెలకు 6 నుంచి 8 సార్లు డయాలసిస్ కోసం దాదాపు రూ.30 వేల వరకు ఆర్థిక భారం భరించలేక తన వద్దకు ఆర్థిక సాయం కోసం పెద్ద ఎత్తున బాధితులు వచ్చే వారన్నారు. ఓ వైపు నగరంలోని ప్రభుత్వ దవాఖానాలో స్లాట్లు దొరక్క.. మరో వైపు ఆర్థిక భారంతో ప్రైవేటు దవాఖానాల్లో డయాలిసిన్ చేయించుకోలేక ప్రాణాలు పోవడం తనను ఆవేదనకు గురిచేసిందన్నారు.
ఎలాగైనా అంబర్ పేటలో ఉచిత డయాలసిస్ సేవలు అందించాలన్న లక్ష్యంతో పట్టుబట్టి ఎట్టకేలకు ఇక్కడ డయాలసిస్ సెంటర్ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. మున్సిపల్ దవాఖానలో రూ.50 లక్షల వ్యయంతో 5 బెడ్లలతో కూడిన జపాన్ టెక్నాలజీతో తయారైన ఐదు అధునాతన డయాలసిస్ పరికరాలతో పాటు రూ.50 లక్షల వ్యయంతో ఆర్వో ప్లాంటు ఏర్పాటు చేశామని తెలిపారు.