గోల్నాక/కాచిగూడ/అంబర్‌పేట, ఏప్రిల్ 11: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబా ఫూలే ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ సర్కార్ బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. మంగళవారం అంబర్‌పేట ఫూలే విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఫూలే జయంతి ఉత్సవాలకు కార్పొరేటర్ విజయ్కుమార్గౌడ్తో కలిసి ఆయన హాజరై ఫూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల హయాం లో నిర్లక్ష్యానికి గురైన బీసీల సంక్షేమం కోసం తెలంగాణ సర్కార్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తోందన్నారు. సంఘ సంస్కర్తగా భారత సమాజంలోని కుల వివక్షపై ఉద్యమించిన పోరాటయోధుడు ఫూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
భారత ప్రథమ సామాజిక తత్వవేత్త మహాత్మాజ్యోతిబా ఫూలే అందరికీ ఆదర్శనీయుడని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు కొనియాడారు. మంగళవారం అంబర్‌పేట అలీకేఫ్ చౌరస్తా వద్ద నిర్వహించిన జ్యోతిరాబా ఫూలే జయం తి వేడుకలకు మాజీ ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావుతో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఫూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
– గోల్నాక, ఏప్రిల్ 11