మన్సురాబాద్: పదిహేడు నెలల కిందట పనులు పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్న పార్కులను రెండు రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, లేనిపక్షంలో గేట్ల తాళాలు పగలగొట్టి ప్రజలకు అప్పజెప్పుతామని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి హెచ్చరించారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి కేబీఆర్ కన్వెన్షన్ హాల్ ప్రాంగణంలో సోమవారం మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ 2023 నవంబర్‌లో ఎన్నికల కోడ్ అమల్లోకి రాక ముందు నియోజకవర్గంలో 15 కొత్త పార్కులను మంజూరు చేసినట్లు చెప్పారు. ఎన్నికల నిబంధనల కారణంగా ప్రారంభోత్సవం వాయిదా పడిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడుస్తున్నా.. పనులు పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఆరు పార్కులను ప్రారంభించకుండా కాంగ్రెస్ నాయకులు అధికారులను అడ్డుకుంటున్నారని తెలిపారు.
పార్కులు తన చేతుల మీదుగా ప్రారంభిస్తే తనకు మంచి పేరు వస్తుందని ఇన్చార్జి మంత్రితో ప్రారంభించాలని ప్రయత్నాలు చేశారని.. కానీ ఇంతవరకు ఇన్చార్జి మంత్రి అపాయింట్మెంట్ కూడా ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులకు దొరికినట్లు లేదన్నారు. పేరు ప్రఖ్యాతల కోసం తాను వెంపర్లాడడం లేదని రెండు రోజుల్లో పార్కులను సంబంధిత అధికారులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోకపోతే గేట్ల తాళాలు పగలగొడతానన్నారు. ఆరోగ్యం బాగాలేక కొన్ని రోజులుగా ఇంటి వద్దే ఉండాల్సి వచ్చినప్పటికీ ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు సలహాలు ఇస్తూ.. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నానన్నారు. ప్రతిపక్ష నాయకులు తన ఆరోగ్యంపై కూడా తప్పుడు ప్రచారం చేశారని.. తనకు క్యాన్సర్ వచ్చిందని.. తిరిగి నియోజకవర్గానికి రానని.. బై ఎలక్షన్ వస్తుందని ఆశపడ్డారని ఎద్దేవా చేశారు. ప్రజల ఆశీర్వాదంతో తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని.. ఇకనుంచి 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానన్నారు.