మన్సూరాబాద్, ఏప్రిల్ 2 : అధికారం కోసం బీజేపీ అనైతిక చర్యలకు పాల్పడుతూ ప్రజల మధ్య మత విద్వేశాలను రెచ్చగొడుతుందని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, కాలనీల సంక్షేమ సంఘం ప్రతినిధులతో కలిసి ఆదివారం ఎంఈరెడ్డి గార్డెన్లో డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు జక్కిడి మల్లారెడ్డి, బీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు జక్కిడి రఘువీర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేను డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు జక్కిడి మల్లారెడ్డి, బీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు జక్కిడి రఘువీర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోని ప్రతి హిం దువు గోవును పూజిస్తాడని ఇది తరతరాలుగా వస్తున్న ఆనవాయితని తెలిపారు.
బీజేపీ నాయకులు మాత్రం గోసంరక్షణ పేరుతో ఇప్పుడు రాజకీయాలు చేస్తూ గోవులను తామే కాపాడుతున్నట్లు ప్రచారాలు చేసుకుంటున్నారని తెలిపారు. హిందూ సంప్రదాయం, కట్టుబొట్ల గురించి ఇప్పుడు కొత్తగా ప్రజలకు బీజేపీ చెప్పాల్సిన అవసరం లేదని తెలిపారు. బీజేపీ వాళ్లు చెబితేనే శ్రీరామనవమిని మనం చేసుకుంటున్నామా… శ్రీరాముడిని పూజించడం.. శ్రీరామనవమిని ఘనంగా జరుపుకుని శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం మన పూర్వీకుల నుంచి కొనసాగుతుందని తెలిపారు. కేంద్రంలో బీజేపీ పార్టీ వచ్చాకే హిందువులు పం డుగుల చేసుకుంటున్నట్లు ప్రచారాలు చేసుకోవడం వారి రాజకీయ దిగజారుడు తనాలకు నిదర్శనమని తెలిపారు. మన ఆచారాలను గౌరవించుకుంటూనే ఇతర మతాలను గౌరవిస్తూ ఎలాంటి విద్వేశాలు లేకుండా కలసికట్టుగా జీవిస్తున్నామని తెలిపారు.
అస్తవ్యస్తంగా ఉన్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని రూ.700 కోట్ల వ్యయంతో ఎల్బీనగర్లోని ప్రధాన కూడళ్లలో ఫ్లైఓవర్లు, అండర్ పాస్ రోడ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. ప్రతి రోజూ నగరం నుంచి వివిధ జిల్లాలకు 30 వేల మంది ప్రయాణిస్తున్నారని దీని వలన ఎల్బీనగర్ రింగ్‌రోడ్డు ప్రాంతంలో తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు నడుంకట్టామని తెలిపారు. అత్యున్నత ప్రమాణాలతో దేశంలో ఎక్కడా లేని విధంగా ఆటోనగర్ హరిణ వనస్థలి నుంచి క్రీడా ప్రాంగణం వరకు 24 బస్టాండ్లను ఏర్పాటు చేసే పనులకు త్వరలో మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తారని తెలిపారు.
ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఎల్బీనగర్లో ఇప్పటికే ప్రాపర్టీ ట్యాక్స్‌లను తగ్గించామని తెలిపారు. ఆటోనగర్ డంపింగ్ యార్డు స్థలంలో అతి త్వరలో అందమైన పూలవనాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎమ్మె ల్సీ బొగ్గారపు దయానంద్ గుప్త, మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి, కర్మన్‌ఘాట్ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ పోచబోయిన ఈశ్వరమ్మయాదవ్, నాయకులు, కాలనీల సంక్షేమ సంఘం ప్రతినిధులు పోచబోయిన జగదీశ్‌యాదవ్, టంగుటూరి నాగరాజు, కొసనం ధనలక్ష్మి, కరణం శ్రీకాంత్, రుద్ర యాదగిరి, నర్రి వెంకన్న కురుమ, అత్తాపురం రాంచంద్రారెడ్డి, కొసనం వెంకట్‌రెడ్డి, గుంటకండ్ల రాజశేఖర్‌రెడ్డి, జెట్టా మహేశ్వర్, జేజే రెడ్డి, మార్గం రాజేశ్, కేకేఎల్ గౌడ్, సిద్దగౌని జగదీశ్‌గౌడ్, చెంగల్ చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.