బంజారాహిల్స్/ఖైరతాబాద్/హిమాయత్‌నగర్,నవంబర్ 6: బిడ్డా ఇంతదూరం ఎందుకు వచ్చావు.. మాలాంటి వారికి కడుపునిండా అన్నం పెడుతున్న కేసీఆర్ పార్టీకే ఓటేస్తాం.. అంటూ ఓ వృద్ధురాలి అభిమానం. అన్నా మహిళలందరం మీకే ఓటేస్తామంటూ ఓ మహిళ భరోసా.. రాజకీయాలతో సంబంధం లేకున్నా గులాబీ జెండాలు చూడగానే ఇంట్లోంచి బయటకు వచ్చి కారు గుర్తుకే మా ఓటు అంటూ ఉత్సాహంగా నినాదాలు చేస్తున్న యువతీయువకులు. సోమవారం వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలోని నందినగర్, నూర్‌నగర్,ఇబ్రహీంనగర్ తదితర ప్రాంతాల్లో ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇంటింటా ప్రచారం సందర్భంగా కనిపించిన దృశ్యాలు ఇవి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలో ముమ్మరంగా పాదయాత్ర నిర్వహించారు. ఓటర్లను పలకరిస్తూ మరోసారి బీఆర్ఎస్కు ఓటేయాలని కోరారు. గత పదేళ్లలో తెలంగాణలో పేదలకు అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వంలో హ్యాట్రిక్ ఖాయమన్నారు. దానం నాగేందర్ తమ ఇంటికి రావడంతో పలువురు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరకాలనీ కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి , మాజీ కార్పొరేటర్ భారతీనాయక్, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు రాములు చౌహాన్, నాయకులు రాందాస్, వెంకటస్వామి, ఆంథోనీ, జావెద్ పాల్గొన్నారు.
అభివృద్ధి చూసి ఓటు వేయండి
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ఈ నెల 30న జరిగే పోలింగ్‌లో కారు గుర్తుకు ఓటు వేసి ఖైరతాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దానం నాగేందర్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ హిమాయత్‌నగర్ డివిజన్ ఉపాధ్యక్షులు కృష్ణయాదవ్,శ్రీనాథ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దత్తానగర్, నారాయణగూడలో ఇంటింటికీ వెళ్లి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు,అభివృద్ధిపై ప్రజలకు వివరించారు.
బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు; తెలంగాణ ముదిరాజ్ మహాసభ యువజన విభాగం
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలంగాణ ముదిరాజ్ మహాసభ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లుడు జగన్ ముదిరాజ్, రాష్ట్ర సమన్వయ కర్త బి. శ్రీనివాస్ ముదిరాజ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి భరోసా కల్పించి, ఆర్థికంగా సీఎం కేసీఆర్ ఆదుకుంటున్నారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో సంపద పెంచి.. పేదలకు పంచుతున్నదని, గతం కంటే మత్య్స సంపద రెట్టింపు స్థాయిలో పెరిగిందని పేర్కొన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించేందుకు ముదిరాజ్ యవజనులు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.