బంజారాహిల్స్,డిసెంబర్ 17: రాష్ట్రంలోని అన్ని కులాలు, మతాలను సమానదృష్టితో చూడడంతో పాటు వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలన్నదే బీఆర్ఎస్ ప్రభుత్వ విధానమని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతియేటా ఇచ్చే క్రిస్మస్ కానుకల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం ఎమ్మెల్యే దానం నాగేందర్ జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్‌లోని పటేల్‌నగర్ బస్తీలో ప్రారంభించారు.
కార్పొరేటర్ వెల్దండ వెంకటేశ్‌తో కలిసి క్రిస్మస్ కానుకలను పంపిణీ చేసిన అనంతరం ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని మతాలకు సంబంధించిన పండుగలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. పేదలకు కూడా పండుగల ఆనందాన్ని పంచేందుకు కానుకలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా పేదలకు కొత్త బట్టలు అందించడంతో పాటు ఒక్కో డివిజన్లో రూ. 1 లక్ష చొప్పున ఖర్చుచేసి క్రిస్మస్ విందు ఇస్తున్నామన్నారు.
దేశంలోని అనేక రాష్టాల్లో క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయని, అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం క్రైస్తవులకు మంచి గౌరవం లభిస్తోందన్నాన్నారు. దేశంలో మతతత్వ రాజకీయలు ఎక్కువగా నడుస్తున్నాయని, అలాంటి రాజకీయాలవల్ల ప్రజల మధ్యన వైషమ్యాలు పెరిగిపోతున్నాయనే విషయాన్ని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిని దేశం మొత్తం విస్తరించాలనే ఉద్దేశంతో పార్టీ పేరును బీఆర్ఎస్ పార్టీగా మార్చిన ముఖ్యమంత్రి నాయకత్వంలో సరికొత్త మార్పు రానుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సుధాకర్‌రెడ్డి, నడిమింటి కృష్ణ, దాసు, రాములమ్మ, మారెమ్మ, మల్లీశ్వరి, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వరనగర్ బస్తీలోని బాప్టిస్ట్ చర్చిలో పేద క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలను ఎమ్మెల్యే దానం నాగేందర్,కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి చేతులమీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రాములు చౌహాన్, శౌరిరాజు, ఆంథోనీ తదితరులు పాల్గొన్నారు.