Miyapur | మియాపూర్, మార్చి 4 : మియాపూర్‌లోని సర్వే నెంబర్ 92, 93, 94, 96, 97, 98, 100లలో ఉన్న స్థలాలపై సుప్రీం కోర్టులో కేసు నడుస్తుందని, కోర్టు తీర్పు వచ్చే వరకు తమ స్థలాల చుట్టూ హెచ్ఎండీఏ అధికారులు ఫెన్సింగ్ వేయవద్దని ప్రశాంత్‌నగర్ కాలనీ అసొసియేషన్ సభ్యులు అధికారులను కోరారు. ఇదే విషయంపై ఇప్పటికే మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్లకు కాలనీవాసులు వినతి పత్రం అందజేశారు. మంగళవారం కాలనీలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కాలనీ ప్రెసిడెంట్ శ్రీనివాస్‌రావు మాట్లాడారు. మియాపూర్‌లోని సర్వే నెంబర్ 100లోని 40 ఎకరాలతో ఒక లేఅవుట్, సర్వే నెంబర్100తో పాటు 92, 93, 94, 95, 97, 98లలో 30 ఎకరాలతో మరో లేఅవుట్ చేయగా, వీటిని 1990, 1991లలో హెచ్ఎండీఏ అనుమతులు ఇచ్చింది. చాలా మంది పేద మధ్య తరగతి వారు, పలు ప్రభుత్వ సంస్థలలో పనిచేసిన వారు కొనుగోలు చేశారన్నారు. 2003లో సర్వే నెంబర్ 100,101లోని 550 ఎకరాలు ప్రభుత్వ భూమి అని ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసిందని, ఆ తర్వాత ఇందులో 40 ఎకరాల భూమి ప్రశాంత్‌నగర్ కాలనీకి చెందినదిగా ప్రభుత్వం తరుపున హెచ్ఎండీఏ పంచనామా చేసిందన్నారు. మిగిలిన 236 ఎకరాల భూమి ప్రభుత్వంకు చెందినదిగా గుర్తించారని ప్రస్తుతం ఈ స్థలం హుడా ఆధీనంలో ఉందని శ్రీనివాస్ రావు పేర్కొన్నారు.
ఇటీవల 100, 101 సర్వే నెంబర్లలో ఉన్న ప్రభుత్వ స్థలంలో కొందరూ చీరలు కట్టి, గుడిసెలు వేసుకొని అక్రమించేందుకు ప్రయత్నించగా, హెచ్ఎండీఏ అధికారులు ఈ రెండు సర్వే నెంబర్లలో ఉన్న స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసారన్నారు. ఇందులో 40 ఎకరాలకు చెందిన లేఅవుట్ చుట్టూ ఫెన్సింగ్ వేయగా, పంచనామా నిర్వహించని, కోర్టులో కేసు నడుస్తుండగా మిగిలిన 30 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ వేసేందుకు హెచ్ఎండీఏ అధికారులు సిద్ధమయ్యారనీ తెలిపారు. దీంతో ప్రశాంత్‌నగర్ కాలనీవాసులు అందరం ఫెన్సింగ్ పనులు ఆపివేయాలని మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి దాన కిశోర్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను కలిసి వినతి పత్రం అందజేసామన్నారు. చాలా సంవత్సరాలుగా తమ కాలనీ స్థలాలు కబ్జాకు గురికాకుండా అడ్డుకుంటున్నామని, కోర్టులో కేసు ఉందని, కోర్టు తీర్పు వచ్చే వరకు తమ స్థలాల చుట్టూ ఫెన్సింగ్ వేయవద్దని అధికారులకు కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ వైస్ ప్రెసిడెంట్ నర్సింహులు, కార్యదర్శి రవి పాల్గొన్నారు.