సోమవారం 25 మే 2020
Hyderabad - Apr 02, 2020 , 07:08:00

గుండెపోటుతో.. మియాపూర్‌ కార్పొరేటర్‌ మృతి

గుండెపోటుతో.. మియాపూర్‌ కార్పొరేటర్‌ మృతి

  • మంత్రి, ఎంపీ, మేయర్‌, ఎమ్మెల్యే, తదితరులు నివాళి
  • రమేశ్‌ అకాల మృతి బాధించింది మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌
చందానగర్‌, నమస్తే తెలంగాణ : మియాపూర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ మేక రమేశ్‌ గుండెపోటుతో మృతి చెందారు. మంగళవారం అర్ధరాత్రి ఛాతిలో మంటరావడంతో వారి కుటుంబ సభ్యులు నిజాంపేటలోని హోలిస్టిక్‌ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందారు. రమేశ్‌ అకాల మృతితో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌, స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, డిప్యూటీ మేయర్‌ బాబా ఫసియొద్దీన్‌, జీహెచ్‌ఎంసీకి చెందిన పలువురు కార్పొరేటర్లు, నియోజకవర్గంలోని వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రమేశ్‌కు నివాళులర్పించారు. రాయదుర్గంలోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు.

నివాళులర్పించిన ఎమ్మెల్యే మాధవరం

మియాపూర్‌ కార్పొరేటర్‌ మేక రమేశ్‌ మృతి చెందినట్టు సమాచారం అందుకున్న కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బుధవారం ఆయన నివాసంలో రమేశ్‌ భౌతికకాయం వద్ద నివాళులర్పించారు.

కేటీఆర్ సంతాపం

కార్పొరేటర్‌ మేక రమేశ్‌ మృతిపట్ల మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. రమేశ్‌ అకాల మృతి దిగ్భ్రాంతికి గురిచేయడంతో పాటు తనను ఎంతో బాధించిందని తెలిపారు. నేరుగా వచ్చి నివాళులర్పించలేక పోతున్నందుకు చింతిస్తున్నానని అన్నారు. రమేశ్‌ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.logo