Gandhi Hospital | సిటీబ్యూరో, మే19 (నమస్తే తెలంగాణ): నగరంలోని గాంధీ ఆస్పత్రిలో పరిపాలన రోజురోజుకు గాడితప్పుతోంది. సరైన పర్యవేక్షణ లేకపోవడం మూలానా రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ వైద్యం కోసం వందల కిలోమీటర్ల దూరంనుంచి వచ్చే రోగులను స్ట్రెచర్‌పై తీసుకుపోయే నాథుడు కూడా లేడు. రోగితో వచ్చిన సహాయకుడే వార్డు వరకు స్ట్రెచర్‌పై పడుకోబెట్టుకొని తీసుకువెళ్లే పరిస్థితి. స్ట్రెచర్ కావాలంటే కూడా ఏదైనా షూరిటీ పెట్టాలంటూ సిబ్బంది పెట్టే వేధింపులకు వైద్యం కోసం వచ్చిన వారంతా బిక్కుబిక్కుమంటున్నారు. పేదల ఆస్పత్రా లేక కార్పొరేట్ ఆధీనంలో ఏమైనా నడుస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎఫ్ఎన్ఓలు, ఎంఎన్ఓలు చేయాల్సిన పనులు కూడా రోగులతో పాటు వచ్చే బంధువులే చేస్తుండటం గమనార్హం.
బంధువులే సిబ్బందిగా..
నగరంలో పేదల పెద్దాసుపత్రిగా పిలువబడే గాంధీ జనరల్ ఆసుపత్రికి రెండు తెలుగు రాష్ర్టాలతోపాటు, కర్నాటక, మహారాష్ట్ర నుంచి నిత్యం రోగులు వస్తుంటారు. ఈ ఆస్పత్రికి సుమారు 2వేల వరకు ఔట్పేషెంట్లు వస్తుంటారు. అదేవిధంగా 1200 పడకల సామర్థ్యం కలిగిన ఈ ఆస్పత్రిలో 27 విభాగాల్లో నిత్యం వైద్యసేవలందిస్తుండటం గమనార్హం. తెలంగాణలోని ఉమ్మడి మెదక్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాల ఆసుపత్రులు అత్యవసర చికిత్సపొందే రోగులను గాంధీకి వెళ్లమని రిఫర్ చేస్తుంటాయి.
గాంధీలో సత్వర వైద్యమందుతుందని ఆశలో వచ్చే వారికి ఇక్కడ నిరాశే మిగులుతుంది. అంబులెన్స్ నుంచి రోగిని దించాలంటే స్ట్రెచర్, వీల్‌చైర్ సమయానికి దొరక్కపోగా, రోగిని ఆసుపత్రి లోపలికి తీసుకెళ్లే ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓలు సైతం వీరిని పట్టించుకోరు. రోగితో పాటు వచ్చిన సహాయకులే చేసేదేమి లేక ఆసుపత్రిలోపలికి వెళ్లి స్ట్రెచర్ తీసుకొచ్చుకునే పరిస్థితి నెలకొంది. ఆలోపు పరిస్థితి విషమించి పేషెంటు మరణిస్తే అంతే సంగతి. వార్డుల్లో సైతం ఇదే తంతు కొనసాగుతోంది.
చేయి తడపనిదే వైద్యం అందని పరిస్థితి..!
దీనికి తోడు ప్రతి ఇన్‌పేషెంట్‌కు సంబంధించి చికిత్సకు ముందు, తర్వాత తాము చెప్పినంత ఇవ్వాలని ఆస్పత్రిలోని కొంతమంది సిబ్బంది దబాయిస్తున్నట్లు విమర్శలున్నాయి. దీంతో గాంధీ ఆస్పత్రికి రావాలంటేనే రోగులు భయపడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి గాంధీలో సకాలంలో వైద్యం అందించడంతో పాటు అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
సెల్‌ఫోన్ ఇస్తేనే వీల్‌చైర్ ఇస్తాం..
ఒకవైపు రోగి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే అతన్ని అంబులెన్స్‌లోంచి దించి వార్డులోకి తీసుకువెళ్లాలంటే రోగి లేదా అతనితోపాటు వచ్చిన సహాయకుడి ఫోన్ సంబంధిత సిబ్బంది వద్ద షూరిటీగా పెడితేనే వీల్‌చైర్, స్ట్రెచర్‌ను ఇస్తున్నారనే విమర్శలున్నాయి. ఆ సమయంలో ఇంటినుంచి ఫోన్లు వచ్చినా, అత్యవసర ఫోన్లు వచ్చినా వదులుకోవాల్సిందే. వాస్తవానికి వైద్యంకోసం వచ్చిన రోగిని స్ట్రెచర్‌లో తీసుకెళ్లి సంబంధిత వార్డులో వైద్యం చేయించి ఆఖరకు అతను డిశ్చార్జ్ అయినప్పుడు కూడా వాహనం వరకు వీల్‌చైర్‌లో తీసుకురావాల్సిన బాధ్యత ఎఫ్ఎన్ఎంలు, ఎంఎన్ఓల పైనే ఉంటుంది. వారు లేనప్పుడు ఇతర సంబంధిత సిబ్బంది ఆ విధులు నిర్వహించాలి. గాంధీలో మాత్రం ఈ వ్యవస్థ పూర్తిగా విరుద్ధంగా ఉంది. రోగిని తనతోపాటు వచ్చిన సహాయకుడే స్ట్రెచర్‌పై పడుకోబెట్టి తీసుకురావాలి, తిరిగి అతనే తీసుకుపోవాల్సిన పరిస్థితి ఉంది.