మేడిపల్లి, జూన్ 19 : మహిళా న్యాయవాది కార్యాలయం పై దుండగుల దాడిచేసిన ఘటన పై మేడిపల్లి పోలీసులు కేసునమోదు చేశారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. సివిల్ వివాదంలో కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ బాధితురాలికి అనుకూలంగా రావడంతో కక్ష పెంచుకున్న మోహన్ రెడ్డి ,ప్రవీణ్, వెంకటేశ్.. ఈనెల 17న నారపల్లిలో ఉన్న హైకోర్టు న్యాయవాది ఎం.శిరీష ఇంట్లోకి చొరబడి దాడిచేయడతో పాటు అసభ్య పదజాలంతో దూషించారు.
మరుసటి రోజు జూన్ 18న ఉదయం మేఘనాథ్‌తో పాటు పదిమంది వ్యక్తులు మారణాయుధాలతో కార్యాలయంలోకి ప్రవేశించి ఆఫీస్ ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ల్యాప్‌టాప్‌ను అపహరించారు. ముఖ్యమైన ఫైళ్లు, పత్రాలను చించివేశారు. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకకుండా ఉండాలని ఆఫీస్ చుట్టున్న సీసీ టీవీలను, కేబుళ్లను కత్తిరించి ధ్వంసం చేశారు. బాధితురాలు శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి సబ్ ఇన్స్పెక్టర్ ఏ నర్సింగ్‌రావు ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు.