మేడ్చల్ కలెక్టరేట్, జనవరి3: కేంద్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను అర్హులకు అందేలా కృషి చేయాలని జాతీయ మైనార్టీ కమిషనర్ సభ్యురాలు సయ్యద్షాహేజాది అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్యన్, జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మైనార్టీ సంక్షేమం, వారి అభివృద్ధికి ప్రవేశపెట్టిన కార్యక్రమాలను ఆయా శాఖల అధికారులు పూర్తి స్థాయిలో అమలు చేయాలని సూచించారు. తద్వారా మైనార్టీల జీవితాల్లో వెలుగులు నింపాలన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి మైనార్టీలకు సంబంధించి పథకాలపై సమీక్షా సమావేశాలు నిర్వహించి, ప్రభుత్వ లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు.
షీ టీమ్స్ వివరాలను ఆయా కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు, యువతులతో పాటు మహిళలకు తెలియజేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. వివిధ పథకాలతో పాటు ప్రధాన మంత్రి 15 సూత్రాల పథకం అమలు తీరు తెన్నులను సంబంధిత జిల్లా శాఖల అధికారులను జాతీయ మైనార్టీ కమిషన్ సభ్యురాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో డీఆర్వో లింగ్యానాయక్, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి నవీన్ రెడ్డి, రీజనల్ స్థాయి కో ఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి పద్మజారాణి, డీఈవో విజయకుమారి, జిల్లా సంక్షేమ అధికారి పావని, వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి ఝాన్సీరాణి, లీడ్ బ్యాంక్ మేనేజర్ కిశోర్, రోడ్డు, భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీనివాస మూర్తి, ఏసీపీ రామలింగరాజు, కీసర ఆర్డీవో రవి, యువజన క్రీడల అధికారి బలరాం, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.