Pocso Case | హైదరాబాద్లో అఘాయిత్యం జరిగింది. మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ చేయడమే కాకుండా, వీడియో తీసి పలుమార్లు బ్లాక్మెయిల్ చేసి వారి కోరికను తీర్చుకున్నారు. ఈ క్రమంలో వారి వేధింపులు తాళలేక బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులపై పోక్సో కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ దుండిగల్ ప్రాంతంలోని డబుల్ బెడ్రూం ఇండ్ల సమీపంలోని ఓ షామియానా దుకాణంలో శివకుమార్ అలియాస్ మట్టు (20) పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అటువైపు నుంచి వెళ్లే ఓ బాలికపై మట్టు కన్నేశాడు. ఈ క్రమంలో ఒకరోజు బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండటం గమనించి ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.
బాలిక మౌనంగా ఉండటాన్ని అదునుగా చేసుకున్న మట్టు అతని స్నేహితుడు నిజాంపేట రాము(30)తో కలిసి మరోసారి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో ఫొటోలు, వీడియోలు తీశారు. తాము ఎప్పుడు పిలిస్తే అప్పుడు తమ దగ్గరకు రావాలని.. లేదంటే వాటిని బయటపెడతామని హెచ్చరించారు. ఆ తర్వాత నిందితుల నుంచి వరుస వేధింపులు రావడంతో తట్టుకోలేక బాలిక తల్లిదండ్రులకు జరిగినదంతా చెప్పేసింది. తల్లిదండ్రుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోక్సో కేసు నమోదుచేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.