విద్యారంగ చరిత్రలోనే ఓ చిరస్మణీయ దినం. విద్యావ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటుకు దీటుగా రూపుదిద్దుకున్నాయి. మన ఊరు మన బడి కార్యక్రమంతో కార్పొరేట్ వసతులను సంతరించుకున్నాయి. మొదటి దశలో పునరుద్ధరించిన ప్రభుత్వ పాఠశాలలను బుధవారం ఒకే రోజు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రారంభించారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ప్రగతినగర్ మండల ప్రజాపరిషత్ ప్రభు త్వ పాఠశాలను ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌తో కలిసి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని రాచులూరు ప్రాథమిక పాఠశాలను విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ప్రారంభించారు.
పద్మారావునగర్‌లోని మైలార్‌గూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, సోమాజిగూడలోని రాజ్‌భవన్ పాఠశాల, కంటోన్మెంట్ పరిధిలోని పికెట్‌లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను స్థానిక ఎమ్మెల్యేలు దానం నాగేందర్, సాయన్నలతో కలిసి పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రారంభించారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి కమలానగర్‌లోని ప్రభుత్వ పాఠశాల, ఘట్కేసర్ మండలంలోని పోచారం ప్రభుత్వ పాఠశాలను కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు. మిగిలిన నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మన ఊరు మన బడిలో అభివృద్ధి చేసిన పాఠశాలలను ప్రారంభించారు. కొత్తగా మారిన పాఠశాల, సమకూరిన వసతులతో విద్యార్థులు సంబురపడిపోయారు.
దుండిగల్, ఫిబ్రవరి 1 : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కార్పొరేట్ స్థాయిలో పోటీ పడే విధంగా ఉండాలని ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో ఎలాంటి వసతులు ఉంటాయో, ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అలాంటి వసతులు ఉండాలనే ఉద్దేశంతో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ప్రగతినగర్‌లోని మండల ప్రజాపరిషత్ ప్రభుత్వ పాఠశాలలో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా రూ.62లక్షలతో చేపట్టిన అధునాతన వసతులను బుధవారం మంత్రి హరీశ్ రావు స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ఈ రోజు తల్లిదండ్రులందరూ తమ పిల్లలు ఆంగ్ల మాధ్యమంలో చదువుకోవాలని కోరుకుంటున్నారని.. దీనిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంలో విద్యాబోధన ప్రారంభించామన్నారు. అంతేకాకుండా విద్యార్థులకు డైనింగ్, తాగునీరు, సోలార్ విద్యుత్ వంటి వసతులను కల్పించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల పిల్లలు కార్పొరేట్ స్కూళ్లతో పోటీ పడి 10/10 జీపీఏ సాధించాలని సూచించారు. రాష్ట్ర స్థాయి ర్యాంకులు, బాసర ఐఐటీలో సీట్లు సాధించడంతో పాటు డాక్టర్లు, ఇంజినీర్లు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల నుండే రావాలని మనసారా కోరుకుంటున్నానని పేర్కొన్నారు.
విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులను నియమిస్తున్నాం
విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులను నియమిస్తున్నామని, రానున్న రోజుల్లో రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. ఉపాధ్యాయులు మంచి విద్యతో పాటు విద్యార్థులకు సామాజిక బాధ్యతను చెప్పాలన్న ఆయన వారి ఆరోగ్య పరిస్థితిపై దృష్టిసారించాలని సూచించారు. చక్కటి సంస్కారం, బాధ్యత కలిసిన విద్యార్థులను తయారుచేసి సమాజానికి అందజేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన, రాష్ట్ర అసిస్టెంట్ ప్రోగ్రాం అధికారి రమేశ్, డీఈవో విజయకుమారి, ఏఏంవో రవీందర్‌రాజు, ఏఎస్సీ అయ్యన్న, నిజాంపేట్ మేయర్ కొలన్ నీలాగోపాల్‌రెడ్డి, ఇన్చార్జి కమిషనర్ రామకృష్ణారావు, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నేతలు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.