కాచిగూడ, జూన్ 11: సీఎం కేసీఆర్ తెలంగాణలో 24 గంటల పాటు కరెంట్‌ను అందిస్తున్నారని, బీజేపీకి దమ్ముంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 24 గంటలు విద్యుత్ ఇవ్వాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రధాని మోదీకి సవాల్ విసిరారు. తెలంగాణ భావసార్ క్షత్రీయ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ 47వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం గోల్నాక సుందర్‌నగర్‌లోని భావసార్ భవన్లో విద్యార్థులకు నోట్‌బుక్‌లను పంపిణీ చేశారు. కార్యక్రమానికి మంత్రి తలసాని ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ భావసార్ క్షత్రీయ కుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో 60 ఏండ్లలో లేని అభివృద్ధి కేవలం 9 ఏండ్లల్లోనే జరిగిందని పేర్కొన్నారు
. కిషన్‌రెడ్డి ఎంపీగా గెలిచి నియోజకవర్గ ప్రజలకు ఇప్పటివరకు ఒరగబెట్టిందేమీలేదన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సమానంగా ఉండే ఎకైక పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. అంబర్‌పేట నియోజకవర్గంలో కిషన్‌రెడ్డి హయాంలో జరగని అభివృద్ధి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఆధ్వర్యంలో నాలుగేండ్లల్లో చేశారని అన్నారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ మాట్లాడుతూ కోట్లాది రూపాయలు వెచ్చించి విద్యారంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విప్లవాత్నకమైన మార్పులు తీసుకువచ్చాడని, విద్యార్థులు అందిపుచ్చుకోవాలని సూచించారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇప్పడు ఏ మోహం పెట్టుకొని ప్రజలను ఓట్లు అడుగుతాడని మండిపడ్డారు.
ఎమ్మెల్యేకు ఘన సన్మానం
అనంతరం భావసార్ క్షత్రీయ ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకుడు దిలీఫ్ఘనతే ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జగదీశ్వర్‌రావు, కల్యాణ్దాస్ గాడలే, కిషన్‌రావు గాడలే, గోపాల్‌రావు భగాడే, భావసార్ క్షత్రీయ ప్రతినిధులు ఉమేశ్ జైతానే, బీఆర్ఎస్ నాయకులు దిలీప్ఘనతే, అశ్విన్ పతంగే, గౌరిశంకర్ కటారే, శ్రీధర్లోకండే, ఆర్కే బాబు, భరత్‌రాజ్ ముదిరాజ్, కాలేరు రామకృష్ణ, కాలేరు రాజు, బుచ్చిరెడ్డి, లక్ష్మిముదిరాజ్, యూసుఫ్‌షరీఫ్, తదితరులు పాల్గొన్నారు.