హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Srinivas Yadav) అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని రాంగోపాల్ పేట డివిజన్ లో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన పలు చోట్ల మాట్లాడారు. పదేండ్లలో దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధిక సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యాయని వెల్లడించారు.
అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం కోరుకుంటుందని అన్నారు. 50 సంవత్సరాలలో జరగని అభివృద్ధి తొమ్మిదిన్నర సంవత్సరాల లో జరిగిందని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి గా కేసీఆర్(CM KCR ) బాధ్యతలు చేపడతారని వివరించారు.
నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో డ్రైనేజీలు, రోడ్లు నిర్మించామని తెలిపారు. దళితులు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ప్రారంభించిన దళిత బంధు దళితులందరికీ అందజేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.1200 ఉన్న గ్యాస్ సిలిండర్ను రూ.400కే అందజేస్తామని వివరించారు.