మారేడ్‌పల్లి, ఆగస్టు 25: మోండా మార్కెట్లోని జీహెచ్ఎంసీకి చెందిన దుకాణాలు (మడిగెలు) ప్రస్తుతం ఉన్న వారికే ఇవ్వడంతో పాటు, పాత ధరల ప్రకారం అద్దెలను తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారును ఆదేశించారు. మాసాబ్ ట్యాంక్‌లోని మంత్రి కార్యాలయంలో గురువారం మంత్రి తలసానిని దుకాణ దారులు కలిసి తమ సమస్యలను విన్నవించారు. మోండా మార్కెట్లో జీహెచ్ఎంసీకి చెందిన దుకాణాలు (మడిగెలు)లలో తాము ఎంతో కాలం నుంచి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, ఇప్పుడు అధికారులు దుకాణాల అద్దెలు పెంచారని మంత్రికి వివరించారు.
పెంచిన అద్దెలను తాము చెల్లించలేని పరిస్థితిలో ఉన్నామని, ప్రస్తుతం ఉన్న అద్దెకు కేటాయింపు చేసేలా చూడాలని మంత్రిని కోరారు. స్పందించిన మంత్రి తలసాని, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ తో ఫోన్లో మాట్లాడి పాత రేట్ల ప్రకారం అద్దెలు తీసుకోవాలని, అదేవిధంగా ప్రస్తుతం ఉంటున్న వారికే దుకాణాలను కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తమ సమస్య పరిష్కారానికి చొరవ చూపిన మంత్రికి వ్యాపారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం లోఎస్టేట్ ఆఫీసర్ భాషా, డీసీ ముకుందరెడ్డి, మోండా మార్కెట్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు హరికృష్ణ, మాజీ కార్పొరేటర్ అరుణ పాల్గొన్నారు.