సీఎం కేసీఆర్ పది సంవత్సరాల్లో దేశంలోనే అన్ని మెట్రో నగరాల కంటే ధీటుగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారు. వందేళ్ల నగర భవిష్యత్తుకు గట్టి పునాదులు వేశారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.. సరైన సమయంలో కాంగ్రెస్, బీజేపీలకు మరోసారి బుద్ధి చెబుతారు..’ అని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బీఆర్ఎస్ తొలి జాబితా విడుదల తర్వాత హైదరాబాద్ అభివృద్ధి తీరును ఆయన ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు.
‘కాంగ్రెస్ ఈ రాష్ర్టాన్ని ఐదు దశాబ్దాలు పాలించింది. కానీ తెలంగాణకు ఒరగబెట్టిందేముంది? హైదరాబాద్ నగరాన్ని ఆదాయ వనరుగా వినియోగించుకున్నదే తప్ప.. తెలంగాణ ఏర్పడేనాటికి నగరంలో మౌలిక వసతులు సరిగ్గా లేవు.
తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంటే.. దేశంలో బీజేపీ అధికారంలో ఉంది. కానీ ఏ ఒక్కనాడైనా హైదరాబాద్ అభివృద్ధికి రూపాయి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? రోజూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న బీజేపీ నాయకులు పైసా నిధులు తెచ్చారా? అయినా… సీఎం కేసీఆర్ పది సంవత్సరాల్లో దేశంలోనే అన్ని మెట్రో నగరాల కంటే దీటుగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారు. వందేండ్ల నగర భవిష్యత్‌కు గట్టి పునాదులు వేశారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.
సరైన సమయంలో కాంగ్రెస్, బీజేపీలకు మరోసారి బుద్ధి చెబుతారు..’ అని రాష్ట్ర పశు సంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ తొలి జాబితా విడుదల చేసిన తర్వాత నగర ప్రజల నుంచి వస్తున్న అనుకూల స్పందనలు, ప్రతిపక్షాలు అయోమయంలో పడిన తీరుతో పాటు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వందేండ్ల ముందుచూపుతో చేపడుతున్న హైదరాబాద్ అభివృద్ధి తీరును ఆయన ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…
హైదరాబాద్‌ను విశ్వ నగరం చేస్తామంటూ గతంలో పాలకులు మాటలు చెప్పారు. కానీ తెలంగాణ ఏర్పడేనాటికి నగరంలో డ్రైనేజీ, మంచినీళ్లు, రోడ్లు, వరద నివారణ.. ఇలా ఏ ఒక్క అంశంలోనూ సరైన మౌలిక సదుపాయాలు లేవు. సుమారు పది సంవత్సరాలుగా జరుగుతున్న హైదరాబాద్ అభివృద్ధి మన కండ్ల ముందే ఉంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి జరగని అభివృద్ధి బీఆర్ఎస్ హయాంలో జరిగింది. తెలంగాణతో పాటు హైదరాబాద్ అభివృద్ధి దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిందని కేంద్ర మంత్రులే ప్రశంసిస్తున్నారు. అవార్డులు ఇస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు వాళ్ల జీవితాల్లో ఇంత అభివృద్ధిని చూడలేదు. నేడు నగరంలో ఎక్కడ చూసినా విశాలమైన రోడ్లు, ఫ్లైఓవర్లు, స్టీల్ బ్రిడ్జిలు కనిపిస్తున్నాయి.
హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా పుష్కలమైన మంచినీళ్లు, విశాలమైన రోడ్లు, ప్రజా రవాణా, మురుగునీటి శుద్ధి కేంద్రాలు, రోడ్ల అనుసంధానం, లక్ష మంది నిరుపేదలకు డబుల్ బెడ్రూం, స్ట్రాంవాటర్ డ్రైనేజీ, ఎల్ఈడీ లైట్లు, వైకుంఠధామాలు, చారిత్రక నిర్మాణాల పునరుద్ధరణ, సుందరీకరణ, రూ.5 అన్నపూర్ణ భోజనం, వేలాది స్వచ్ఛ ఆటోలతో పకడ్బందీగా పారిశుధ్య నిర్వహణ, నిర్మాణ వ్యర్థాల ట్రీట్మెంట్ ప్లాంట్లు… ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈ అభివృద్ధితో పాటు నగరంలోని నిరుపేదలకు సంక్షేమ పథకాలనూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్నది. ఐటీ రంగంలో బెంగళూరును మించిపోయాం. మంత్రి కేటీఆర్ చొరవతో అనేక అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగాయి. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఎక్కడా వమ్ము చేయకుండా సీఎం కేసీఆర్ హైదరాబాద్‌ను అభివృద్ధి చేశారు. ఫలానా చోట… ఫలానా అభివృద్ధి జరగలేదని ప్రతిపక్షాలు వేలెత్తి చూపలేని పరిస్థితి ఉంది.
నగరంలో ఏదో రెండు ఫ్లైఓవర్లు కట్టి అదే అభివృద్ధి అని ప్రచారం చేసుకున్న రోజులు ఉన్నాయి. అంతెందుకు… కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంబర్‌పేట ఛే నంబర్, ఉప్పల్-నారపల్లి ఫ్లైఓవర్లను ఐదేండ్లుగా నిర్మిస్తూనే ఉన్నది. కానీ సగం పని కూడా పూర్తి కాలేదు. అదే సమయంలో సీఎం కేసీఆర్.. మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ఊహించనిరీతిలో నిర్మాణాలను పూర్తి చేశారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్ఆర్డీపీ) తొలి విడత కింద రూ.6763.86 కోట్లతో అనేక నిర్మాణాలు చేపట్టగా, ఏకంగా 36 పనులు పూర్తయ్యాయి. మిగిలిన 12 పనులు పురోగతిలో ఉన్నాయి. అందులో ప్రధానంగా 20 ఫ్లైఓవర్లు, ఐదు అండర్‌పాస్‌లు, ఏడు ఆర్వోబీలు, ఆర్‌యూబీలు, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, పంజాగుట్ట బ్రిడ్జి… ఇలా అనేకం ఉన్నాయి. నేను రాజకీయాల్లో ఉండి ఇన్ని దశాబ్దాలైనా… ఇన్ని అభివృద్ధి పనులను తక్కువ సమయంలో పూర్తి చేయడం చూడలేదు. నగరంలో రోడ్ల విస్తరణ చేపట్టి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేశాం. ఇక ఉప్పల్ జంక్షన్… ఎల్బీనగర్ జంక్షన్… అద్భుతంగా మారాయి. ఎస్ఆర్డీపీ రెండో దశ కింద రూ.3500 కోట్లతో ప్రతిపాదనలు కూడా సిద్ధంగా ఉన్నాయి.
నగరంలో చిన్నపాటి వర్షానికే లోతట్టు ప్రాంతాలు మునగడమనేది గత ప్రభుత్వాల నిర్లక్ష్యం. 2020లో హైదరాబాద్ చరిత్రలోనే రెండో అతి పెద్ద వర్షం కురిసింది. అనేక ప్రాంతాల్లో జనం అవస్థలు పడ్డారు. మాకు సాయం చేయండి… అని సీఎం కేసీఆర్ కోరినా.. కేంద్రం స్పందించలేదు. గుజరాత్‌కు వేల కోట్ల వరద సాయం చేసింది. కానీ హైదరాబాద్‌కు నయా పైసా ఇవ్వలేదు. ఒకవైపు ముంపు నివారణకు సీఎం కేసీఆర్ వందల కోట్ల రూపాయలు వెచ్చించడమే కాకుండా కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు రూ. పది వేల ఆర్థిక సాయం చేశారు. దానిని కూడా బీజేపీ నాయకులు రాజకీయం చేశారు. కేంద్రం నుంచి నిధులు రాకున్నా ఢిల్లీకి వెళ్లి కేంద్రాన్ని అడగలేదు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు నగరంలో ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడైనా బయటికొచ్చి ప్రజలకు అండగా నిలబడలేదు. మంత్రి కేటీఆర్‌తో పాటు మిగిలిన మంత్రులు, ఎమ్మెల్యేలు అందరం బాధితుల వద్దకు వెళ్లి.. అండగా నిలిచినం.
హైదరాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్… ముందుచూపుతో రాబోయే వంద సంవత్సరాల కోసం ప్రణాళికలు రూపొందించారు. పెద్ద ఎత్తున నగరం విస్తరిస్తున్నది. జనాభా పెరుగుతున్నది. అందుకే కృష్ణా, గోదావరి నుంచి మంచినీటికి ఢోకా లేకుండా ప్రాజెక్టులు పూర్తి చేశాం. ఇంకా అనేకచోట్ల ఫ్లైఓవర్లు, అనుసంధాన రోడ్లు నిర్మించాల్సి ఉంది. భవిష్యత్‌లో కూడా ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా ఉండటంతో పాటు పెరుగుతున్న అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడున్న మెట్రో ప్రాజెక్టుతో పాటు ఎయిర్‌పోర్టు మెట్రో, ఔటర్ మెట్రో ఇలా 400 కిలోమీటర్లకు పైగా మెట్రో మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. ఇన్నేండ్లుగా కొనసాగుతున్న ప్రగతి ఆగిపోవద్దంటే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి..సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. మేం ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ఇదే మాట చెబుతున్నారు.
సీఎం కేసీఆర్ 115 మంది అభ్యర్థులను ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో కూడా దాదాపుగా అన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. కానీ ఇప్పటివరకు ఏ చౌరస్తాలోనైనా బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు కనిపించాయా? గతంలో టికెట్లు రాక కాంగ్రెస్ నాయకులే గాంధీభవన్ మీద దాడి చేసిన ఘటనలు చూశాం. కానీ బీఆర్ఎస్ క్రమశిక్షణ ఉన్న పార్టీ. వాస్తవానికి పార్టీ కోసం కష్టపడిన వాళ్లు చాలా మంది ఉన్నారు. వారందరికీ భవిష్యత్‌లో కచ్చితంగా మంచి మంచి అవకాశాలు వస్తాయి. చిన్న చిన్న అసంతృప్తి ఎక్కడైనా ఉంటే నేను స్వయంగా వెళ్లి ఆ నాయకులతో మాట్లాడుతున్నాను. ఎక్కడా ఎలాంటి సమస్య లేదు.
– సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ)