బన్సీలాల్‌పేట్, అక్టోబర్ 26 : పద్మారావునగర్‌లోని హమాలీబస్తీలో బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవం సందర్భంగా రెండో రోజు బోనాల జాతర జరిగింది. బుధవారం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో బస్తీవాసుల చిరకాల వాంఛగా బొడ్రాయి ఏర్పాటు జరగడంతో హమాలీబస్తీలో పండుగ వాతావరణం నెలకొన్నది. ఫేజ్-1, ఫేజ్-2 బస్తీలకు చెందిన రెండు కుటుంబాలు ఐకమత్యంగా పూజలకు హాజరు కావడం విశేషంగా నిలిచింది. వేద పండితుల సూచన మేరకు బుధవారం రాత్రి నుండి గురువారం తెల్లవారుజాము వరకు బస్తీలోకి రాకపోకలు నిలిపివేశారు. ఉదయం బలి పూజ నిర్వహించాక, అభిషేకం, పోతురాజుల నృత్యాల నడుమ ప్రతి ఇంటి నుంచి బోనాలను సమర్పించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై బొడ్రాయికి తొలిపూజ నిర్వహించారు.
అనంతరం మంత్రి స్వంత ఖర్చుతో రెండు బస్తీలప్రజలకు భోజనాలను ఏర్పాటు చేశారు. బస్తీలోని చిన్నా, పెద్ద అందరూ కుటుంబాలతో సహా బొడ్రాయి పూజకు హాజరయ్యారు. బీఆర్ఎస్ పద్మారావునగర్ ఇన్చార్జి జీ పవన్‌కుమార్‌గౌడ్, నాయకులు ఏసూరి మహేశ్, అధ్యక్షుడు వెంకటేశన్ రాజు, ఎం. సురేశ్, వెంకటరమణ, హరిచారి, సుధాకర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, బస్తీ చైర్మన్ శివప్ప, అధ్యక్షుడు ఎన్.సుభాష్, యా దగిరి, అంజయ్య, సత్యనారాయణ, రవి, నర్సింగ్, లక్ష్మమ్మ, కౌసల్య, దుర్గ, కుషాల్, శ్యామ్, వెంకటేశ్, రాములు, కమ్మశ్రీ ను, రాజు, శివభార్గవ, సందీప్, సంపత్, ఛత్రపతి శివాజీ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.
రెండు బస్తీలలో నివసించే పేద, మధ్య తరగతికి చెందిన రెండు వేల కుటుంబాలు ఎన్నో ఏండ్ల నుండి బొడ్రాయి ఏర్పాటు చేయాలని అనుకుంటున్నామని, అది ఇప్పటికీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ద్వారా నెరవేరడం ఎంతో ఆనందంగా ఉన్నదని హమాలీబస్తీ చైర్మన్ శివప్ప, అధ్యక్షుడు ఎన్.సుభాష్, ఎం. యాదగిరి అన్నారు. ఇటీవల బస్తీకి వచ్చిన తలసానిని వారు కలిసి తమ మనసులోని కోరికను చెప్పడంతో ఆయన అంగీకరించారు. పది రోజుల్లో బొడ్రాయి ఏర్పాటు చేయడం, పూజల నిర్వహణ, జాతర ఏర్పాట్లు, భోజనాలు తదితర అన్ని ఖర్చులను మంత్రి తలసాని భరించినందుకు వారు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన సూచించిన విధంగా బస్తీ ప్రజలు ఐకమత్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నామని వారు అన్నారు.