హైదరాబాద్ : ప్రజలు కంటి చూపు సంబంధ సమస్యలతో బాధపడకూడదు అనే ఆలోచనతోనే ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు కూడా ఉచితంగా చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అంబర్‌పేట నియోజకవర్గంలో కంటి వెలుగు శిబిరాలను స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌తో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. కంటి వెలుగు అనేది ఒక గొప్ప కార్యక్రమం అని ప్రశంసించారు. ఈ శిబిరాలలో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, మందులు, కళ్ళద్దాల పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. అవసరమైన వారికి కంటి ఆపరేషన్ లను కూడా ఉచితంగా చేస్తారని తెలిపారు. పేద ప్రజలు కంటి పరీక్షలు, ఆపరేషన్ల కోసం ఆర్ధిక ఇబ్బందులు పడకూడదనే ఆలోచనతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. దేశంలో ఎవరూ చేయని విధంగా సీఎం కేసీఆర్ పేద, మద్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఇంత గొప్ప కార్యక్రమం చేపట్టారని చెప్పారు. కంటి వెలుగు కార్యక్రమం కోసం ప్రభుత్వం రూ. 250 కోట్లను ఖర్చు చేస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనే తయారు చేసిన సుమారు 55 లక్షల కళ్ళద్దాలను పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. అన్ని కాలనీలు, బస్తీలలోని ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు.