బంజారాహిల్స్,ఆగస్టు 24 : దేశంలోఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో కులవృత్తులకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. గురువారం బంజారాహిల్స్ రోడ్ నం.10లోని బంజారా భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీసీ బంధు ద్వారా 300 మంది లబ్ధిదారులకు రూ.లక్ష ఆర్థిక సాయం చెక్కులను స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ విజయలక్ష్మితో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం లక్ష ఆర్థిక సాయాన్ని అందిస్తున్నదన్నారు.
డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైందని, తొలివిడతలో ఒక్కో నియోజకవర్గానికి 500మందిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశామన్నారు. పత్రిపక్ష పార్టీల నేతలు కొంతకాలంగా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఆ మాటలను నమ్మొద్దని అన్నారు. దశాబ్దాలపాటు పాలించిన కాంగ్రెస్‌తో పాటు పలు రాష్ర్టాల్లో అధికారం వెలగబెడుతున్న బీజేపీ నాయకులు అక్కడ ఏం అభివృద్ధి చేసిందో చెప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం పై నోరుపారేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి గెలిచి కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి ఇక్కడి ప్రజల కోసం ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ప్రసన్న రామ్మూర్తి, బీసీ కార్పొరేషన్ జిల్లా అధికారి ఆశన్న, బీసీ బంధు నోడల్ అధికారి చరితారెడ్డి, సికింద్రాబాద్ ఆర్డీవో రవి, సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీతాయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. కంటోన్మెంట్‌లోని లీ ప్యాలెస్ ఫంక్షన్ హాలులో గురువారం బీసీ కులవృత్తులకు చెందిన 300 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.లక్ష ఆర్థిక సహాయం చెక్కులను కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి జి.లాస్యనందిత, కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్, మల్కాజిగిరి పార్లమెంట్, కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డితో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ… మల్కాజిగిరి పార్లమెంట్ ఎంపీగా గెలిచిన రేవంత్‌రెడ్డి ప్రజా సమస్యలను పరిష్కరించకపోగా కనీసం ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాడన్నారు.
ఎంపీగా ఓడిపోయినప్పటికి మర్రి రాజశేఖర్‌రెడ్డి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని అన్నారు. కంటోన్మెంట్లో మడ్పోర్ట్, మారేడ్‌పల్లిలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను త్వరలో లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందితను ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. లాస్యనందిత గెలుపుతో కంటోన్మెంట్ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి, మాజీ బోర్డు సభ్యులు నళిని కిరణ్, పాండుయాదవ్, అనితాప్రభాకర్, బీఆర్ఎస్ నాయకులు టిఎన్. శ్రీనివాస్, నర్సింహ ముదిరాజ్, హరికృష్ణ, నర్సింహ, నివేదిత, సికింద్రాబాద్ ఆర్డీఓ రవి, బీసీ కార్పొరేషన్ జిల్లా అధికారి ఆశన్న పాల్గొన్నారు.