కార్వాన్, జూన్ 30 : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్పే పండుగ ఆషాఢ బోనాలు అని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. కార్వాన్‌లోని దర్బార్ మైసమ్మ ఆలయం వద్ద జూలై 16న నిర్వహించే బోనాల ఏర్పాట్లపై తెలుసుకునేందుకు మంత్రి శుక్రవారం కార్వాన్ దర్బార్ మైసమ్మ ఆలయం వద్ద పలు శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి తలసాని మాట్లాడుతూ.. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా బోనాలు ఘనంగా నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.15 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. జూలై 16న నిర్వహించే బోనాలకు జూలై 10న చెక్కుల పంపిణీ చేస్తామన్నారు. తెలంగాణ వచ్చిన అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో గతం కంటే ఘనంగా జరుపుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. గోల్కొండ బోనాల ప్రారంభం రోజు కేవలం 5 వేల మంది భక్తులు ఉండేవారని ఇప్పుడు 80 వేల మంది హాజరవుతున్నారన్నారు.
భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. దర్బార్ మైసమ్మ ఆలయం వద్ద భక్తుల క్యూ లైన్ కోసం బారికేడింగ్ ఏర్పాట్లు, దాహార్తి తీర్చేందుకు 2 లక్షల తాగునీటి ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతామన్నారు. విద్యుత్ సరాఫరాలో అంతరాయం లేకుండా చూడాలని, ప్రత్యేక తాత్కాలిక సీసీ కెమెరాల ఏర్పాటు, అగ్ని మాపక, వైద్య శాఖ, పోలీస్, ట్రాఫిక్ విభాగం, జీహెచ్ఎంసీ, దేవాదాయ శాఖ, రెవెన్యూ ఖ అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రవికిరణ్, సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ కిరణ్ ఖరే, దర్బార్ మైసమ్మ ఆలయ కమిటీ చైర్మన్ అమర్‌సింగ్, బీఆర్ఎస్ నాయకులు ఠాకూర్ జీవన్ సింగ్, బంగారి ప్రకాశ్, మిత్రకృష్ణ, శేఖర్‌రెడ్డి, కొమ్ముల నరేందర్ పాల్గొన్నారు.
కార్వాన్లో బోనాల సమీక్ష నిర్వహించిన అనంతరం మంత్రి తలసాని దర్బార్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి పూజలు చేశారు. ఆలయ కమిటీ ప్రతినిధులు మంత్రి ఘన స్వాగతం పలికారు.