బంజారాహిల్స్, ఏప్రిల్ 25: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ర్టానికి ఒరగబెట్టింది ఏమిటో చెప్పకుండా తెలంగాణలో అధికారం మాదేనంటూ ప్రగల్బాలు పలుకుతున్న బీజేపీ నాయకులకు ప్రజలు మరోసారి గుణపాఠం చెప్పడం ఖాయమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బంజారాహిల్స్‌లోని బంజారాభవన్‌లో ఖైరతాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశం ఎమ్మెల్యే దానం నాగేందర్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయని అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడిన బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే పేదల సంక్షేమమే ప్రధాన ఎజెండాగా పనిచేస్తున్నదన్నారు.
హైదరాబాద్ నగరంలో 2014కంటే ముందుగా చిన్న రోడ్లు వేయాలన్నా నిధుల కొరత ఉండేదని, ప్రస్తుతం ఒక్కో డివిజన్‌కు కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో సుమారు 50 ఏడ్లు అధికారంలో ఉండి చేసిందేమీ లేదని, ఇప్పుడొచ్చి మరో అవకాశం అంటూ అడిగితే నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. బీజేపీ తొమ్మిదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ర్టానికి ఏమిచ్చిందో చెప్పకుండా కేవలం మతాన్ని అడ్డుపెట్టుకుని చిల్లర రాజకీయాలు చేస్తున్నదని మండిపడ్డారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంటో తెలంగాణ ప్రజల కళ్లముందే కనిపిస్తున్నదని, అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచిన తెలంగాణ మోడల్‌ను ఇతర రాష్ర్టాలు కోరుకుంటున్నాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ..దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న తెలంగాణకు సీఎం కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష అన్నారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధితో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన సంస్థలు పెట్టుబడులు పెట్టడంతో లక్షలాదిమందికి ఉద్యోగాలు లభిస్తున్నాయని తెలిపారు. ఇన్ని పనులు కనిపిస్తున్నా చూడలేని ప్రతిపక్ష పార్టీలకు ప్రజలే బుద్ధి చెపుతారన్నారు రాష్ట్రంలో ఎన్నికలు ఏవైనా గులాబీ జెండా ఎగురడం ఖాయమన్నారు.
ఈ సమావేశంలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి డా.దాసోజు శ్రవణ్‌కుమార్, టీయూఎఫ్ఐసీ చైర్మన్ కే విప్లవ్‌కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ ప్రసన్న రామ్మూర్తి, నియోజకవర్గం సీనియర్ బీఆర్ఎస్ నేత మన్నె గోవర్ధన్‌రెడ్డి, కార్పొరేటర్లు మన్నె కవితారెడ్డి, వనం సంగీతాయాదవ్, బీఆర్ఎస్ నాయకులు రాములు చౌహాన్, అరుణ్‌కుమార్, నిస్సార్, మహేందర్‌బాబు, తాండ్ర మేఘన, జావెద్, విజయ్‌కుమార్, సత్యనారాయణ పాల్గొన్నారు.